
టీటీడీ సంస్థ తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం తీసుకున్న చర్యల్లో భాగంగా ముందస్తుగా దర్శనం టికెట్లు, రూమ్ ను బుకింగ్ చేసుకునే వీలు కల్పిస్తోంది. రెండు నెలల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టనున్నాం.. అంతేకాదు జనవరి ఒకవ తేదీ వైకుంఠ ఏకాదశి కనుక స్వామివారిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకోవాలని ఎక్కువ మంది భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపధ్యంలో శ్రీవారి కొత్త సంవత్సరంలో దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం జనవరి నెల దర్శన కోటాను రేపే రిలీజ్ చేస్తుంది. అంతేకాదు స్వామివారి వారి సేవల లక్కీ డిప్ తో పాటు వివిధ రకాల సేవలు , స్పెషల్ దర్శనం వంటి వాటిని ముందుగానే బుక్ చేసుకునే వీలుని కల్పిస్తోంది.
2026 జనవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఏమిటంటే..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
అక్టోబర్ 23న ఆర్జిత సేవా టికెట్ల విడుదల: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవల కోటా విడుదల: వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబర్ 24న శ్రీవాణి దర్శన కోటా విడుదల: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబర్ 25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల: ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల: తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..