Tirumala : శ్రీవారి అలిపిరి నడకమార్గం రెండు నెలలు పాటు మూసివేయ‌నున్న తిరుమల తిరుపతి దేవస్థానం…!

|

May 26, 2021 | 4:46 PM

Alipiri footpath : దేవదేవుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నడక మార్గాన ప్రయాణించే అలిపిరి మెట్లదారిని రెండు నెలలపాటు మూసివేస్తున్నారు...

Tirumala : శ్రీవారి అలిపిరి నడకమార్గం రెండు నెలలు పాటు మూసివేయ‌నున్న తిరుమల తిరుపతి దేవస్థానం...!
Alipiri Footpath Way
Follow us on

Alipiri footpath : దేవదేవుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు నడక మార్గాన ప్రయాణించే అలిపిరి మెట్లదారిని రెండు నెలలపాటు మూసివేస్తున్నారు. మరమ్మత్తు పనుల కారణంగా రెండు నెలలు పాటు అలిపిరి నడకమార్గంలో భక్తుల రాకపోకలు ఆపివేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 1 నుంచి జూలై 31వరకు అలిపిరి నడకమార్గంలో పైకప్పు నిర్మాణం కోసం భక్తుల రాకపోకల్ని అనుమతించడం లేదని తెలిపింది. ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించు కోవాలని టీటీడీ సూచించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాక తగ్గిన నేపథ్యంలో ఈ మేరకు మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, తిరుమలలో ఆదివారం నుంచి భక్తుల రద్దీ కాస్త పెరిగింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో గత పది, పదిహేను రోజులుగా కేవలం 5 వేలు, ఆ లోపు మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, 2020 సెప్టెంబర్ లో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మరమ్మత్తు పనులు చేశారు. ఈ పనులకోసం అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చింది. మామూలు రోజుల్లో దాదాపు 20వేల మంది భక్తులు ఈ మెట్ల మార్గం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తిరుమల కొండపైకి చేరుకుంటారు.

Alipiri Footpath Works

Read also : TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం