Tirupati: కలియుగ దైవం.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు(Sri Venkateswara Swami) కొలువైన శేషాచలం కొండలు(Seshachalam hills) భక్తులకు ముందుగా కళ్లల్లో మెదిలేది.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం.. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ వృక్షజాతి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. దీంతో అటు పర్యావరణానికి ఇబ్బందులు కలగడంతో పాటు జీవజాతులకు తీవ్రమైన ఆహార కొరతకు కారణమవుతోంది. జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోన్న అకేషియా చెట్లను పూర్తిగా తొలగించేందుకు టీటీడీ(TTD) సిద్ధమవుతోంది. దాదాపు 2 వేల ఎకరాల్లో ఉన్న అకేషియా చెట్లను దశలవారీగా తొలగించి దేశీయ ఔషధ మొక్కలను నాటేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది.
తిరుమల శేషాచల అడవుల్లో వివిధ రకాల జాతుల చెట్లు, వాటిలో తిరుమల క్షేత్రం చుట్టూ ఉన్న మొక్కలన్నీ అకేషియానే. పచ్చదనాన్ని వేగంగా పెంచడానికి ఈ అకేషియా చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని 1980నుంచి దాదాపు 800 హెక్టార్లలో ఈ చెట్లను నాటారు. ఆస్ట్రేలియా తుమ్మచెట్టుగా పిలిచే ఈ ఆకేషియా చెట్లు కేవలం పది నుంచి పదేహేను ఏళ్లలోపే తిరుమలగిరులను పచ్చగా మార్చేశాయి. అయితే ఈ చెట్ల ద్వారా జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు చెట్ల కింద భూసాంద్రత నాశనమవుతోందని టీటీడీ దృష్టికి తీసుకువచ్చిన స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు.. అలాగే 4.5 శాతానికి పీహెచ్ చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం అధికమవుతోందని హెచ్చరించింది.
అకేషియా చెట్ల వలన నష్టం ఏమిటంటే?..
ఫాబేసి కుటుంబంలోని అకేషియా ప్రజాతికి చెందిన ఈ చెట్లు ఏపుగా పచ్చగా పెరుగుతాయి. వీటి కింద ఎటువంటి గడ్డిమొక్కలు, ఇతర మొక్కలు పెరగలేవు. ఎందుకంటే ఇవి తైలం చెట్ల తరహాలో చెట్ల కింద భూసాంద్రతను దెబ్బతీస్తుంది. అంతేకాక పీహెచ్ 4.5 శాతానికి చేరుకొని అమ్లాల శాతం ఎక్కువ ఉంటోంది. దీంతో ఈ విషయాన్ని పరీక్షించిన స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు టీటీడీకి నివేదిక ఇవ్వడంతో కొంత కాలం కిందట చెట్లను తొలగించే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. మొదటి దశలో 600 ఎకరాల్లో అకేషియా చెట్లను తొలగించింది. మిగిలిన 200 హెక్టార్లలో రానున్న పది సంవత్సరాల్లో తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయంపై 2021 జూలై నుంచే టీటీడీ అటవీ శాఖ ఓ కార్యాచరణ రూపొందించి.. అమలు చేసింది.
ఉద్యానవనాలు ఏర్పాటు…
అకేషియా చెట్లు పెరిగే ప్రాంతంలో గడ్డిమొక్కలు పెరగక పోవడంతో.. జింకలు, ఇతర శాఖాహార జంతువులకు ఆహారం ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఆహారం కోసం తరచూ తిరుమలలో జింకలు జనావాసాల ప్రాంతాల్లోకి వస్తున్నాయి.
ఈ జింకలను అనుసరిస్తూ చిరుతలు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శేషాచలం అటవీ ప్రాంతంలో అకేషియా చెట్లను తొలగించిన ప్రాంతంలో ఔషధ మొక్కల పెంచడానికి ప్రణాళికలు రెడీ చేసింది.
ఇప్పటికే పాపవినాశనం వెళ్లే ప్రాంతంలో శ్రీగంధం చెట్లను టీటీడీ పెంచుతోంది. దీంతో పాటుగా శిలాతోరణం సమీపంలో, పాపవినాశనం రోడ్డులో శ్రీ వేంకటేశ్వర పవిత్ర ఉద్యానాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా స్వామివారికి అవసరమైన పూలు, పత్రాలు, ఇతర ఉత్పత్తులను తిరుమలలోనే పండించనున్నారు. అంతేకాదు పండ్ల చెట్లను కూడా పెంచనున్నారు. ఇలా రకరకాల మొక్కలను పెంచడం ద్వారా జీవ వైవిధ్యంతో పాటు జంతువులకు అవసరమైన గడ్డి, పండ్లు అందుబాటులో తీసుకొచ్చి.. జంతువుల ఆహారపు కొరతను తీర్చడానికి టీటీడీ ప్రణాళికలను రెడీ చేసింది.
Also Read: