Zodiac Signs: ఈ 6 రాశులవారికి కొత్త సంవత్సరంలో గృహ యోగం.. అందులో మీ రాశి ఉందా.?

| Edited By: Ravi Kiran

Dec 29, 2022 | 6:46 PM

జనవరి 18 నుంచి శని గ్రహం, ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం, మార్చి 22 నుంచి కుజ గ్రహం రాశులు మారుతున్నాయి..

Zodiac Signs: ఈ 6 రాశులవారికి కొత్త సంవత్సరంలో గృహ యోగం.. అందులో మీ రాశి ఉందా.?
Horoscope
Follow us on

జనవరి 18 నుంచి శని గ్రహం, ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం, మార్చి 22 నుంచి కుజ గ్రహం రాశులు మారుతున్నాయి. శని తన స్వక్షేత్రమైన కుంభ రాశిలోకి, గృహ కారకుడైన గురువు మేషరాశిలోకి, భూమి కారకుడైన కుజుడు మిధున రాశిలోకి మారుతుండడం వల్ల మేష, మిధున, తుల, ధనస్సు, మకర, మీనరాశుల వారికి గృహ, వాహన యోగాలు పట్టబోతున్నాయి. ఈ రాశుల వారికి సునాయాసంగా ఇల్లు, వాహనం అమరుతుండగా, మిగిలిన రాశుల వారు, అంటే, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, కుంభ రాశుల వారికి కొద్దిపాటి కష్టం మీద, కొద్దిపాటి ఆలస్యాలతో గృహ యోగం పట్టే అవకాశం ఉంది. మేష, మిధున, తుల, ధనస్సు, మకర, మీనరాశుల వారు వారి యాచక చక్రాలను బట్టి ఇండిపెండెంట్ ఇంటిని నిర్మించుకోవడమో, ఫ్లాట్ కొనడమో, పాత ఇంటిని కొని మరమ్మతులు చేసుకోవడమో జరుగుతుంది. ఇందులో గృహయోగం పట్టిన వారికి వాహన యోగం కూడా పట్టే అవకాశం ఉంది. శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలోకి వెళ్లడం అనేది పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి కావడానికే కాక, అవసరమైన డబ్బు సకాలంలో చేతికి అందడానికి కూడా తోడ్పడుతుంది.

మేషం, మిధునం, తుల

ఈ రాశుల వారికి జనవరి 18 తర్వాత సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనుక్కోవడానికి నూరు శాతం అవకాశం ఉంది. కొత్తగా వాహనాన్ని కొనడం గానీ, పాత వాహనాన్ని అమ్మేసి కొత్త దానికి మారడం కానీ జరుగుతుంది. ఈ రాశుల వారికి మే నెలలోగా గృహ, వాహన యోగాలు పట్టడం ఖాయమనిపిస్తోంది. మేష రాశికి అధిపతి అయిన కుజుడు మార్చి 22న వృషభం నుంచి మిధున రాశికి మారబోతోంది. ఆ గ్రహం మిధున రాశిలోకి మారగానే మేష రాశికి గృహ యోగం పడుతుంది. ఇందులో మిధున రాశి వారు స్వగృహం మీద భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతారు. ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటారు. వీరు సాధారణంగా విశాలమైన, విలాసవంతమైన ఇంటిని కొనే అవకాశం ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరికి చక్కని గృహ యోగం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక చాలాకాలంగా స్వగృహం కోసం ప్రయత్నాలు చేస్తున్న తులా రాశి వారు శని కుంభ రాశిలోకి ప్రవేశించిన తర్వాత తప్పకుండా ఇంటి యజమాని అవుతారు. తులా రాశి వారికి గృహస్థానాధిపతి శని అయినందువల్ల, ఈ శని స్వక్షేత్రంలో ప్రవేశిస్తున్నందువల్ల తప్పకుండా ఇంటి కోరిక నెరవేరుతుంది. వీరికి అతికొద్ది ప్రయత్నంతో ‘ సౌధ ప్రాకార ప్రకాసితం’ అయిన గృహం కలగటం జరుగుతుంది.

ధనస్సు, మకరం, మీనం

ధనస్సు రాశికి అధిపతి అయిన గురుగ్రహం నాలుగవ రాశి నుంచి ఐదవ రాశిలోకి మారటం, శని కుంభరాశి ప్రవేశంతో ఏలినాటి శని నుంచి బయటపడటం వంటి పరిణామాల వల్ల ఈ రాశి వారికి సొంత ఇంటి కల సునాయాసంగా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 23 తర్వాత తప్పకుండా వీరికి గృహ, వాహన యోగాలు పడతాయని చెప్పవచ్చు. మకర రాశి వారికి ధన స్థానంలోకి శని ప్రవేశించడం, గృహస్థానమైన నాలుగవ రాశిలోకి గురు గ్రహం ప్రవేశించడం, అక్కడ రాహువుతో యుతి పొందడం గృహ, వాహన యోగాలకు సంబంధించినంత వరకు శుభ సూచకం. సాధారణంగా ఈ రాశి వారు పాత ఇంటిని కానీ, పాత ఫ్లాటును గాని కొని బాగు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఏప్రిల్ 23 తర్వాత ఈ రాశి వారు సొంత ఇంటి కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక మీన రాశి వారికి జనవరి 18 తరువాత ఏలినాటి శని ప్రారంభం అవుతున్నప్పటికీ, ఈ రాశికి అధిపతి అయిన గురువు ధనస్థానంలోకి మారటం, మార్చి 22న కుజగ్రహం నాలుగో స్థానంలోకి మారటం వంటి పరిణామాల వల్ల గృహ యోగానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మూడు రాశుల వారు జూలై ప్రాంతంలో గృహప్రవేశం చేసే సూచనలున్నాయి.

ఈ ఆరు రాశుల వారికి వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు, దశలు అంతర్దశలు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా, గృహ, వాహన యోగాలు తప్పకుండా ఫలిస్తాయి. ఇతర రాశులయిన వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, కుంభరాశి వారికి వ్యక్తిగత జాతక చక్రాల్లో గృహ, వాహన యోగాలు బలంగా ఉంటే తప్ప ఈ ఏడాదికి సొంత ఇంటి కల, సొంత వాహనం కల తేలికగా నెరవేరకపోవచ్చు. అయితే, ఇందులో కూడా ఒక్క వృషభ రాశి వారికి మాత్రం అక్టోబర్ 24 తర్వాత, అంటే రాహు కేతువులు మారిన తరువాత గృహ యోగం పట్టే అవకాశం ఉంది.