Baijnath Mahadev Temple: యముడి నోట్లో నుంచి భర్తను కాపాడుకున్న బ్రిటిష్ మహిళ.. శివుడిపై భక్తితో ఆమె ఏం చేసిందంటే?

చరిత్రలో ఎన్నో వింతలు ఉంటాయి. కానీ ఒక విదేశీ సైనికాధికారి భార్య కోసం సాక్షాత్తూ ఆ పరమశివుడు యుద్ధ భూమికి వెళ్ళాడంటే నమ్ముతారా? అఫ్ఘాన్ యుద్ధంలో చిక్కుకున్న భర్తను కాపాడుకున్న ఒక బ్రిటిష్ మహిళ కృతజ్ఞతగా నిర్మించిన అపురూప శివాలయంఇది. అఫ్ఘాన్ సరిహద్దుల్లో మృత్యువుతో పోరాడుతున్న భర్త.. ఇక్కడ ఆలయంలో శివనామస్మరణ చేస్తున్న భార్య. ప్రార్థనలకు మెచ్చిన భోళాశంకరుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? భారత్‌లో బ్రిటిష్ వారు పునర్నిర్మించిన ఏకైక శివాలయం వెనుక ఉన్న ఆసక్తికర గాథ ఇది.

Baijnath Mahadev Temple: యముడి నోట్లో నుంచి భర్తను కాపాడుకున్న బ్రిటిష్ మహిళ.. శివుడిపై భక్తితో ఆమె ఏం చేసిందంటే?
Baijnath Mahadev Temple Agar Malwa

Updated on: Dec 24, 2025 | 6:09 PM

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఉన్న బైజ్‌నాథ్ మహదేవ్ ఆలయం విశిష్టమైన చరిత్రను కలిగి ఉంది. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ పురాతన ఆలయాన్ని 1883లో ఒక బ్రిటిష్ సైనికాధికారి దంపతులు పునర్నిర్మించారు. ఒక అద్భుత సంఘటన వీరు శివభక్తులుగా మారడానికి కారణమైంది. యుద్ధ భూమిలో అద్భుతం 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ అఫ్ఘాన్ యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లారు. అగర్ మాల్వా కంటోన్మెంట్‌లో ఉన్న ఆయన భార్యకు కొన్ని రోజుల పాటు భర్త నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.

ఆందోళనతో ఉన్న ఆమె ఒకరోజు గుర్రపు స్వారీ చేస్తూ శిథిలావస్థలో ఉన్న బైజ్‌నాథ్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న హారతి, మంత్రోచ్ఛారణలు ఆమెను ఆకర్షించాయి. ఆమె బాధను గమనించిన పూజారులు 11 రోజుల పాటు ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించమని సూచించారు. తన భర్త క్షేమంగా తిరిగి వస్తే ఆలయాన్ని బాగు చేయిస్తానని ఆమె మొక్కుకున్నారు.

ముక్కంటి కరుణ ఆమె ప్రార్థనలు మొదలుపెట్టిన పదో రోజున మార్టిన్ నుంచి ఒక లేఖ వచ్చింది. అందులో ఆయన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని రాశారు. యుద్ధంలో శత్రువులు తనను చుట్టుముట్టిన సమయంలో.. పులి చర్మం ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకున్న ఒక యోగి ప్రత్యక్షమై శత్రువులను తరిమికొట్టినట్లు వివరించారు. నీ భార్య ప్రార్థనల వల్ల నిన్ను రక్షించడానికి వచ్చానని ఆ యోగి తనతో చెప్పినట్లు మార్టిన్ పేర్కొన్నారు.

కృతజ్ఞతగా ఆలయ నిర్మాణం భర్త క్షేమంగా తిరిగి వచ్చిన తర్వాత మార్టిన్ దంపతులు 15 వేల రూపాయల భారీ విరాళంతో ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఆలయ శిలాశాసనాలపై నేటికీ కనిపిస్తాయి. ఆ తర్వాత వారు ఇంగ్లాండ్ వెళ్లినప్పటికీ తమ ఇంట్లోనే ఒక శివలింగాన్ని ప్రతిష్టించుకుని తుది శ్వాస వరకు శివుడిని ఆరాధించినట్లు చెబుతారు. 50 అడుగుల ఎత్తు ఉన్న శిఖరంతో, బాణగంగ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం నేడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

ఆలయానికి చేరుకునే మార్గాలు:

విమాన మార్గం: ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం (126 కి.మీ).

రైలు మార్గం: ఉజ్జయిని రైల్వే స్టేషన్ (68 కి.మీ).

రోడ్డు మార్గం: ఉజ్జయిని, ఇండోర్, భోపాల్ నుంచి బస్సు సౌకర్యం ఉంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు చారిత్రక ఆధారాలు, స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్న కథనాల ప్రకారం అందించినవి.