
Golden Temple Jejuri: భారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయలకు నిలయం. ఇక్కడ అనేక ప్రత్యేక దేవాలయాలున్నాయి. వాటికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు కూడా ఉన్నాయి. అలాగే, మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొండపై వెలసిన ‘జేజూరి ఖండోబా ఆలయం’ దేశంలోని అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ అడుగుపెట్టగానే గాలంతా పసుపు (భండారా) పొడితో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. వేలాది మంది భక్తులు “ఖండోబా మల్హార్” నామస్మరణతో ఆలయాన్ని మార్మోగిస్తుంటారు. అయితే ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది మరో అరుదైన విశేషం. హిందూ భక్తులతో పాటు ముస్లింలు కూడా ఇక్కడికి వచ్చి భక్తితో ప్రార్థనలు చేయడం. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం భారతదేశ ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ మతం కంటే విశ్వాసానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని స్థానికులు చెబుతారు.
చాలామంది ఈ ఆలయాన్ని శివాలయంగా భావించినప్పటికీ, ఇది ఖండోబా స్వామికి అంకితం చేయబడింది. ఖండోబాను మల్హరి మార్తాండ్ లేదా మార్తాండ భైరవ అని కూడా పిలుస్తారు. ఆయనను శివుడి యోధ అవతారంగా భావిస్తారు. దక్కన్ ప్రాంతంలో ఖండోబా అత్యంత ఆరాధ్య దైవాల్లో ఒకరు. మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, యోధులు, వ్యాపారులు, గ్రామీణ వర్గాల ప్రజలు ఆయనను తమ కులదైవంగా పూజిస్తారు.
జేజూరి ఆలయాన్ని దేశంలోని ఇతర ఆలయాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టే అంశం ఇదే. తరతరాలుగా స్థానిక ముస్లిం కుటుంబాలు కూడా ఖండోబా స్వామిని తమ కుటుంబాలకు, పశువులకు, జీవనోపాధికి రక్షకుడిగా భావిస్తూ పూజిస్తుంటాయి. ముస్లిం భక్తులు ఖండోబాను ప్రేమగా “మల్లు ఖాన్”, “అజ్మత్ ఖాన్” వంటి పేర్లతో పిలుస్తారు.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇది ఇటీవల ఏర్పడిన సంప్రదాయం కాదు. అనేక శతాబ్దాలుగా కొనసాగుతోంది. కొంతమంది ముస్లిం పాలకులు ఖండోబా ఆలయాలకు దానధర్మాలు చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాదు, జేజూరి ఆలయ ఉత్సవాల్లో ఉపయోగించే గుర్రాల సంరక్షణ వంటి కొన్ని వంశపారంపర్య బాధ్యతలను ముస్లిం కుటుంబాలే నిర్వహించడం కూడా విశేషం.
చాలామంది ముస్లిం భక్తులు మొక్కులు పెట్టుకోవడం, కోరికలు నెరవేరితే తిరిగి వచ్చి దర్శనం చేసుకోవడం నేటికీ కొనసాగిస్తున్నారు. వారి నమ్మకం ఒక్కటే… “ఆ దేవుడు అందరినీ సమానంగా కాపాడుతాడు.”
స్థానిక పురాణాల ప్రకారం, ఋషులను, ప్రజలను వేధించిన మణి, మల్ల అనే రాక్షసులను సంహరించడానికి ఖండోబా భూలోకంలో అవతరించాడు. వారిని సంహరించిన అనంతరం రైతులు, పశువులు, గ్రామీణ ప్రజలకు రక్షకుడిగా ఖండోబా ఆరాధన ప్రారంభమైంది. అందుకే ఆయనను కేవలం యోధుడిగానే కాకుండా ప్రజలను కాపాడే సంరక్షక దైవంగా కూడా భావిస్తారు.
జేజూరి ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసిన ప్రధాన ఉత్సవం భండారా ఉత్సవం. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు పసుపు పొడిని గాలిలోకి చల్లుతారు. కొద్ది నిమిషాల్లోనే ఆలయం మొత్తం బంగారు వర్ణంతో కళకళలాడుతుంది. ఈ పసుపు శ్రేయస్సు, విజయం, దైవ అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని “సోన్యాచి జేజూరి” (బంగారు జేజూరి) అని కూడా పిలుస్తారు.
జేజూరి ఆలయంలో జరిగే అతిపెద్ద వేడుకల్లో చంప షష్ఠి ఒకటి. ఆరు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం మణి, మల్ల రాక్షసులపై ఖండోబా సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ వేడుకకు హాజరవుతారు.
చరిత్రకారుల అంచనా ప్రకారం ఖండోబా ఆరాధన కనీసం 12వ శతాబ్దం నుంచే కొనసాగుతోంది. జేజూరి ఆలయం కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెంది ఖండోబా ఆరాధనకు ప్రధాన కేంద్రంగా మారింది. జేజూరిగడ్ కొండపై నిర్మించిన ఈ ఆలయం హేమద్‌పంథి శైలిలో నిర్మితమైంది. ఆలయానికి చేరుకోవాలంటే చారిత్రాత్మక దీపస్తంభాల మధ్యగా సుమారు ‘385 రాతి మెట్లు’ ఎక్కాల్సి ఉంటుంది. చరిత్రకారులు, మానవశాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, హిందూ, జైన, ముస్లిం సంప్రదాయాల సాంస్కృతిక సమ్మేళనానికి జేజూరి ఒక అరుదైన ఉదాహరణగా నిలిచింది.
ఈ ఆలయం మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, పుణె నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేజూరి పట్టణంలో ఉంది. కొండపై నుంచి చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల అందాలు కనువిందు చేస్తాయి.
మతం పేరుతో విభేదాలు కనిపించే ఈ రోజుల్లో జేజూరి ఖండోబా ఆలయం భారతదేశ ఉమ్మడి సంస్కృతి, పరస్పర గౌరవం, మత సామరస్యానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. హిందువులు, ముస్లింలు కలిసి ఒకే దైవాన్ని విశ్వసించి మొక్కులు చెల్లించడం ఈ ఆలయ ప్రత్యేకత. అందుకే జేజూరి కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు… ‘భారతీయ ఆధ్యాత్మిక సహజీవనానికి సజీవ చిహ్నంగా’ కూడా గుర్తింపు పొందింది.