AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహాలయ పక్షంలో ఈ పని తప్పక చేయాలట.. పితృదేవతల ఆశీర్వాదం కోసం ఏం చేయాలో తెలుసా?

Mahalaya Paksham 2026: మహాలయ పక్షం పితృ దేవతలకు అంకితం చేయబడిన 16 రోజుల విశిష్ట కాలం. ఈ పక్షంలో గతియించిన పితరులను స్మరించుకొని, శ్రాద్ధ, తర్పణ విధులను పాటించడం అత్యవసరం. కాశీ, గయలలో శ్రాద్ధం చేసినా, వార్షిక శ్రాద్ధం ఉన్నా, మహాలయ పక్షాన్ని పాటించాలని శాస్త్రం చెబుతోంది. పితృ దేవతల ఆశీర్వాదాలను పొందేందుకు ఈ నియమాలు పాటించాలి.

మహాలయ పక్షంలో ఈ పని తప్పక చేయాలట.. పితృదేవతల ఆశీర్వాదం కోసం ఏం చేయాలో తెలుసా?
Pitru Paksha Rituals
Rajashekher G
|

Updated on: Sep 27, 2026 | 6:00 AM

Share

Mahalaya Pitru Pakshalu Prarambham: హిందూ ధర్మంలో పితృ దేవతలకు అంకితం చేయబడిన మహాలయ పక్షం అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత కలిగిన కాలం. “మహా” అనే శబ్దాన్ని మన హిందూ పండగలలో దసరా నవరాత్రులలో మహానవమి, శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి, పన్నెండు అమావాస్యలలో మహాలయ అమావాస్య అని మూడుసార్లు వినియోగిస్తాం. మహాన్ అత్యంతికో లయో యత్ర మహాలయం అనే వ్యుత్పత్తి ప్రకారం, ఇది అత్యంతిక ప్రాధాన్యత కలిగిన అమావాస్య. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అని పిలుస్తారు. వర్ష ఋతువులో వచ్చే ఈ అమావాస్య ప్రత్యేకమైనది, ఎందుకంటే ఈ రోజున పగటి సమయం తక్కువగానూ, రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది. పితృ దేవతలు వాయు రూపంలో, చీకట్ల సహాయంతో తమ సంతతిని సులభంగా సమీపిస్తారని నమ్మకం. తమ కుటుంబ సభ్యులు తమ ధర్మాన్ని, సంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా అని పరిశీలించి, పాటిస్తే సంతృప్తిగా ఆశీర్వదించి తిరిగి వెళ్తారని, లేకపోతే విషాదంతో వెనుదిరుగుతారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి తన ప్రవచన వీడియోలో వివరించారు.

మహాలయ అమావాస్య ప్రస్తావన కాలమృతం అనే గ్రంథంలోని సప్తమ బిందువు, ఐదవ శ్లోకంలో, మహాలయ నిర్ణయం అనే అంశంగా 227వ విషయంగా తెలుసుకోవచ్చు. సంవత్సరం మొత్తంలో 96 పితృ దినాలు ఉంటాయి. వీటిలో 12 అమావాస్యలు, 12 వ్యతీపాతలు, యుగాదులు, మన్వాదులు, అలాగే పుష్యం, మాఘం, ఫాల్గుణం నెలలలో కృష్ణపక్షంలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి తిథులలోని అష్టకా శ్రాద్ధములు ఉంటాయి. ఇలా వెరసి 80 రోజులు కాగా, మిగిలిన 16 రోజులే భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే మహాలయ పితృ పక్షాలు. భాద్రపద మాసం కృష్ణపక్షం పాడ్యమి నుంచి ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి వరకు ఈ 16 రోజుల కాలాన్నే మహాలయ పక్షం అని అంటారు.

సాధారణంగా ప్రజలకు కలిగే కొన్ని సందేహాలను ఇక్కడ నివృత్తి చేశారు. కాశీ, గయ, ప్రయాగ, రామేశ్వరం వంటి దివ్యక్షేత్రాలలో తర్పణాలు లేదా శ్రాద్ధాలు నిర్వహించిన వారు కూడా మహాలయ పక్షంలో తప్పనిసరిగా శ్రాద్ధ విధిని పాటించాలని శాస్త్రం చెబుతోంది. అలాగే, వార్షిక ఆబ్దికం లేదా మాసికం మహాలయ పక్షంలోనే వచ్చినప్పటికీ, ఆబ్దికం నిర్వహించిన వారు కూడా మహాలయం తప్పనిసరిగా చెయ్యాలి. తిథి ఆధారిత ఆబ్దికం కేవలం వసురుద్రాదిత్య రూపంగా ఉండే నిర్దిష్ట పితరులకు మాత్రమే సంబంధించినది. అయితే మహాలయం సోమః పితృయమోగ్నిష్వాత్తాగ్ని కవ్యవాహనాదియాగల సప్త వర్గాలకు సంబంధించిన పితృదేవతాకమైనది, సమస్త బంధుగణాలకు సంబంధించినది. మానవ కోణంలో తెలిసి తెలియక ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి సైతం కృతజ్ఞతాపూర్వకంగా నువ్వులు, నీళ్లతో కూడుకున్న తర్పణాన్ని సమర్పించేదే మహాలయం.

ఇవి కూడా చదవండి

మహాలయ అమావాస్య నాడే మహాలయం పూర్తికాదు. మరుసటి రోజు కూడా దీని ప్రాముఖ్యత ఉంటుంది. కొడుకులు లేని కుటుంబాలలో కుమార్తెలకు కుమారులు (దౌహిత్రులు) కలిగిన యెడల, ఆ మరణించిన తాతగారికి, బామ్మగారికి నిర్వహించే ఆబ్దిక రూపమైన మహాలయమే దౌహిత్రిక మహాలయం. దీనిని ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాడు నిర్వహిస్తారు. పెతరమాస పేరుతో ప్రాంతీయ ఆచారాలకు లోబడి బియ్యం, పెసరపప్పు, బెల్లం, కూరగాయలు వంటివి బ్రాహ్మణులకు అందించడం లేదా శ్రాద్ధమే ఏర్పాటు చేయడం వంటి సంప్రదాయాలు ఉన్నాయి. ఎలా చేసినా, ఏ విధంగా చేసినా మహాలయ పక్షం తప్పనిసరిగా పాటించాలని శాస్త్ర వచనం. ధర్మాచరణతో సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి సందేశమిచ్చారు. కాలమృతం, యల్లాజీయం వంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఈ విషయాలపై మరింత స్పష్టతను అందిస్తాయి. కాగా, సెప్టెంబర్ 27 నుంచి పక్షాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 10 వరకు కొనసాగుతాయి.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా వివరించబడ్డాయి. ఆచారాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయాలను బట్టి మారవచ్చు.)

Follow Us