Yadadri: ఇవాళ యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. వారం రోజులపాటు పంచకుండాత్మక మహాయాగం

|

Mar 21, 2022 | 8:06 AM

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ క్రతువు ఇవాళ అంగరంగ వైభవంగా అంకురార్పణతో మొదలవుతోంది

Yadadri: ఇవాళ యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. వారం రోజులపాటు పంచకుండాత్మక మహాయాగం
Yadadri
Follow us on

Yadadri Temple Maha Kumbha Samprokshanam: దేవదేవుడు యాదాద్రి లక్ష్మీనారసింహుడి(Sri Lakshmi Narasimha Swamy) భక్తులకు శుభవార్త. తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పున: ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలకు సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న స్వామివారి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ క్రతువుకు ఇవాళ అంగరంగ వైభవంగా అంకురార్పణ జరుగనుంది. ఈ నెల 28 వరకు జరుగనున్న మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ప్రధానాలయంలోని స్వయంభువుల దర్శనాలు మొదలుకానున్నాయి. వారంపాటు నిర్వహించే పంచకుండాత్మక మహాయాగానికి సర్వం సిద్ధం చేశామని ఆలయ ఈవో గీతా రెడ్డి తెలిపారు.

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు రంగం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి వారంపాటు బాలాలయంలో నిర్వహించనున్న పంచకుండాత్మక యాగం కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధానాలయంలోని గర్భాలయ దర్శనాలకు వారమే గడువు ఉండటంతో ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. మహాకుంభ సంప్రోక్షణ యాగాన్ని 28 వరకు పాంచరాత్రాగమన శాస్త్రపద్ధతిలో నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలతో 2016లో ప్రధానాలయ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. చిన్న జీయర్ స్వామితో కలిసి పలు దఫాలుగా పర్యటించి ఆలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రధానాలయ పనులు పూర్తి కావడంతో ఆలయ ఉద్ఘాటనకు ప్రభుత్వం ముహూర్తాన్ని ఖారారు చేసింది. ఈ నెల 28న మహా సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యావా వాచన మంత్రాలతో నారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేయనున్నారు. బాలాలయంలో ఐదువిధాలుగా కుండాలను ఏర్పాటుచేశారు. తూర్పున చతురస్రాకారాంలో, పడమర వృత్తాకారంలో, ఉత్తరంలో త్రికోణం, దక్షిణంలో అర్థచంద్రకారం, ఈశాన్యంలో పద్మాకారంలో హోమగుండాల నిర్మాణాలు పూర్తయ్యాయి. 28 వరకు రుత్వికులు, అర్చకులు మూలమంత్ర, మూర్తిమంత్రహోమాలు నిర్వహించనున్నారు. యాగాన్ని 24 రకాల ద్రవ్యాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యితో నిర్వహిస్తామని చెబుతున్నారు ఆలయ ప్రధాన అర్చకులు.

ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా పూర్వాంగభూతంగా నేటి నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నారు. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువును నిర్వహిస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. ఆలయ గోపురాల కలశాల అన్నింటికీ సంప్రోక్షణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తియ్యాయన్నారు. అలాగే ఈనెల 21 నుంచి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనెల 28న సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రదానాలయంలోకి తరలిస్తారు. ఆ రోజు పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాతే భక్తుల దర్శనాలకు అనుమతి ఉంటుందని ఈవో చెప్పారు. ఆలయ ఉద్ఘాటనకు అందరూ ఆహ్వానితులేనని ఈవో తెలిపారు.

యాదాద్రి కొండ కింద నిర్మించిన దీక్షాపరుల మండపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నూతనంగా నిర్మించిన కల్యాణ కట్ట, పుష్కరిణిలు అందుబాటులోకి తీసుకువచ్చారు. యాదాద్రి ఆలయ పున: ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ , జిల్లా యంత్రాంగం, ఇతర అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడుకి జియో ట్యాగింగ్ చేసయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Read Also… Clouds: కొన్ని మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయి..? కారణాలు తెలుసుకోండి..!