
Surya Arghyam benefits: సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. ఈ క్రియ ద్వారా లభించే అద్భుతమైన ఫలితాలను ప్రముఖ పండితులు సామవేదం షణ్ముఖ శర్మ తమ ప్రవచనాల ద్వారా వివరించారు. అర్ఘ్యము అంటే పూజించుట అని, సూర్య నమస్కారం వలెనే సూర్యుడికి అర్ఘ్య ప్రదానం కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదని ఆయన ఉద్ఘాటించారు. ఇది సామాన్యులు కూడా సులభంగా ఆచరించదగిన విధానమని, నిత్యం లేదా సప్తమి, ఆదివారం వంటి ప్రత్యేక దినాలలో చేసుకోవచ్చని తెలిపారు.
అర్ఘ్యం సమర్పించే పద్ధతిని శణ్ముఖ శర్మ వివరంగా తెలియజేశారు. సూర్యుడికి అన్ని లోహాల పాత్రలకంటే రాగి పాత్ర అంటే చాలా ఇష్టమని, ఆదిత్య పురాణంలో సూర్యభగవానుడే తనకు తామ్రమే మహా ప్రీతి అని చెప్పినట్లు ఉదాహరించారు. కనుక రాగి పాత్రను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి, అందులో పవిత్రమైన నీటిని తీసుకోవాలి. ఆ శుద్ధ జలంలో ఎర్రచందనం, కుంకుమ, ఎర్రని అక్షతలు, ఎర్రని పువ్వులు, దూర్వాంకురాలు (గరికలు) కలుపుకోవాలి. మోకాళ్ళ మీద కూర్చుని, సూర్యునికి ఎదురుగా ఒక పళ్ళెం పెట్టుకుని, ఆ పళ్ళెంలోకి నీటిని వదులుతూ అర్ఘ్యం ఇవ్వాలి.
సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆయన నామాలను ఉచ్చరించడం విశేష ప్రాధాన్యతను కలిగి ఉంది. ప్రధానంగా 12 నామాలు పేర్కొనబడ్డాయి.. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. కొన్ని గ్రంథాలలో ముఖ్యంగా స్కాంద పురాణంలో 72 నామాలు కూడా ఉన్నాయని శణ్ముఖ శర్మ తెలిపారు. ఈ నామాలను వ్యక్తిగతంగా “మిత్రాయ నమః” అంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్ఘ్యం ఇవ్వవచ్చు, లేదా అన్ని నామాలను కలిపి
‘మిత్రరవిసూర్యభానుఖగపూషహిరణ్యగర్భమరీచ్యాదిత్యసవిత్రర్కభాస్కరేభ్యో నమః’ అంటూ ఒకే అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఇలా అన్ని నామాలను కలిపి ఏడు మార్లు (సప్త పర్యాయాలు) కూడా అర్ఘ్యం ఇవ్వవచ్చని వివరించారు.
సూర్యనారాయణుడికి అర్ఘ్య ప్రదానం వల్ల కలిగే ఫలితాలు అద్భుతమైనవి. ఇది శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రారబ్ధ కర్మల వల్ల సంభవించే రోగాలను నయం చేసే శక్తి సూర్యుని ఆరాధనకు ఉందని, పాపాలను పోగొట్టగలిగే శక్తి సూర్యుడికి ఉందని ఆయన నొక్కి చెప్పారు. సూర్య భగవానుడు శబ్ద ప్రియుడు అని, దేవతలు శబ్దానికి ప్రీతిపాత్రులని తెలిపారు. మంత్రాలు, నామాలలో ఉన్న శబ్ద ప్రకంపనలు అమోఘమైన శక్తిని కలిగి ఉంటాయన్నారు. ప్రతి నామం భగవంతుడు ధరించిన శబ్దావతారమేనని అన్నారు. అందువల్ల సూర్య నామాలను ఉచ్చరిస్తూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల సూర్యుని అనుగ్రహం లభిస్తుంది.
అర్ఘ్యం సమర్పించేటప్పుడు పఠించవలసిన మంత్రం: “ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే.” ఈ మంత్రానికి “వేల కిరణాలు కలిగిన ఓ సూర్యా, తేజస్సు యొక్క రాశివి, జగత్తుకు పతివి, నా పట్ల దయ చూపి ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు, నీకు నమస్కారం” అని అర్థం. ఈ మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని శణ్ముఖ శర్మ సూచించారు. నిత్యం అర్ఘ్యం ఇవ్వడం కుదరని పక్షంలో కనీసం ఆదివారాలలో ప్రత్యేకంగా ఒక నమస్కారం చేసుకోవాలని కూడా సూచించారు.