ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం శ్రీమల్లికార్జునస్వామి తలపాగా వస్త్రం, రుద్రాక్షలను భక్తులకు విక్రయించేందుకు దేవాలయ అధికారులు రంగం సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం తలపాగ వస్త్రం, రుద్రాక్షలను కొనుగోలు చేసేందుకు వీలుగా దేవస్థానం విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణములోని కైలాస కంకణాల విక్రయకేంద్రాల్లో ఈ పాగా వస్త్రం, రుద్రాక్షల విక్రయాలను దేవస్థానం ఈవో లవన్న ప్రారంభించారు. మల్లన్న ఆలయంలో శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపి ఈవో లవన్న మొదటగా వీటిని స్వయంగా కొనుగోలు చేసి విక్రయాలను ప్రారంభించారు. కాగా ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి రోజున ఆలయంలో పాగాలంకరణ చేయడం జరుగుతోంది. అలానే హిందువులు సంప్రదాయంగా జరిపే వివాహాలలో పెండ్లి కుమారుడికి తలపాగాను చుట్టడం ఒక సంప్రదాయం.
ఈ ఆచారమే శ్రీశైల ఆయలంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగాను శ్రీ స్వామివారి గర్భాలయ విమానగోపురం శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించడం జరుగుతుంది. స్వామివారి ఈ తలపాగా వస్త్రాన్ని, పంచముఖ రుద్రాక్షలు (3 నెంబర్లు) కలిపి ఒక్కింటికి 150 రూపాయల చొప్పున శ్రీస్వామివారి తలపాగా వస్త్రం విక్రయం చేస్తుండగా అలానే కేవలం రుద్రాక్షలు మాత్రమే కోరుకునే భక్తుల సౌకర్యార్థం మూడు ముఖాల రుద్రాక్షలను కలిగిన పాకెట్ ఒక్కింటికి 50 రూపాయలతో భక్తులకు అందుబాటులో దేవస్థానం ఉంచామని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..