Gangamma Jatara 2025: ఘనంగా కొనసాగుతున్న గంగమ్మ జాతర.. తన ప్రియమైన సోదరికి ఘనంగా సారే పంపిన శ్రీవారు
తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. భక్తులు మాతంగి వేషాలు వేసుకొని, పొంగళ్ళు పెట్టి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. టీటీడీ తరపున ఛైర్మన్, ఈవో అమ్మవారికి సారెను సమర్పించారు. పండుగ చివరి రోజున, శుభ సమయంలో పోర్టికోను ముక్కలుగా పగులగొడతారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా నిర్వహించే గంగ జాతరతో తిరుపతిలో సరికొత్త కోలాహలం నెలకొంది. జాతరలో డప్పుల దరువులతో హోరెత్తిస్తున్నారు భక్తులు. వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో భక్తుల సందడి కొనసాగుతోంది. ప్రతి ఏడాది మే నెలలో జరిగే ఈ జాతర కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతరకు చాటింపు వేసి పొలిమేర్లను అష్టదిగ్బంధనం చేయడంతో తిరుపతి మొత్తం జాతర సంబరం ప్రతి ఇంటా కనిపిస్తోంది. తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరిగా భావించబడే గంగమ్మ దేవిని తాతయ్యగుంటలో గంగమ్మ దేవాలయంలో పూజిస్తారు. గంగ జాతరలో వేషాలదో ప్రత్యేకత. భక్తులు చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. అంతే కాదు బూతులు తిడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించడం ఇక్కడి ప్రత్యేకత. ఇలా జాతరలో పౌరాణిక చారిత్రక వేషాలతో పాటు సాంఘిక వేషాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు భక్తులు.
గంగమ్మను శ్రీవారి సోదరిగా భావించే టీటీడీ ప్రతియేటా అమ్మవారికి సారెను సమర్పిస్తుంది. ఈ సారి టీటీడీ తరపున ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామల రావు అమ్మవారికి సారెను సమర్పించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి సైతం అమ్మవారిని దర్శించుకుని సారె సమర్పించారు. ఏటా అమ్మవారికి టిటిడి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరలో ఈ నెల 13న అర్ధరాత్రి కీలక ఘట్టంగా గంగమ్మ విశ్వరూప దర్శన మిస్తారు. వేలాది మంది భక్తుల మధ్య అమ్మవారి మట్టి ప్రతిమకు పూజలు నిర్వహించనున్న కైకాల వంశస్థులు పేరంటాల వేషంలో చెంప నరకడం ద్వారా జాతర ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




