హిందూ ధర్మంలో గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందని చాలా మంది నమ్ముతారు. సైన్స్ ప్రకారం భూమి, సూర్యుని మార్గం మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ నెలలో రెండు వారాల వ్యవధిలో సూర్య , చంద్ర గ్రహణాలు రెండూ సంభవించనున్నాయి. సూర్య గ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ గ్రహణం సర్వ పితృ అమావాస్య నాడు వస్తుంది. అంతేకాదు సూర్య గ్రహణం శని అమావాస్య రోజున ఏర్పడనుంది. దీంతో ఈ రోజుకి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ సూర్య గ్రహణం భారత దేశంలో కనిపించదు కనుక.. సుతకాలం చెల్లదు.
ఈ గ్రహణాన్ని “రింగ్ ఆఫ్ ఫైర్” అని పిలుస్తారు, ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చంద్రుడు భూమి సూర్యుని మధ్య కు వెళ్లే సమయంలో సూర్య దూరం సగటు కంటే ఎక్కువగా ఉండటం వల్ల సూర్యుడు అతి చిన్నగా కనిపిస్తాడు. ఫలితంగా, సూర్యుని బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మధ్య భాగం పూర్తిగా చంద్రునిచే కప్పబడి “రింగ్ ఆఫ్ ఫైర్” ప్రభావాన్ని సృష్టిస్తుంది.
ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 శనివారం రాత్రి 08:34 గంటలకు ప్రారంభమై.. తెల్లవారు జామున 02:25 గంటల కంటే ముందే ముగియనుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం వలన మేష రాశి, కర్కాటక, తుల , మకరం రాశివారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సూర్య గ్రహణ ప్రభావం భారత దేశంలో లేకపోయినా గ్రహణ సమయంలో పూజ గదిలో దేవతలను తాకడం.. ఆలయాలు తెరవడం వంటి పనులు చేయవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు.. అయితే ఉత్తర అమెరికా , కెనడా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా, వెనిజులా, జమైకా, హైతీ, పరాగ్వే, బ్రెజిల్, డొమినికా, బహామాస్ వంటి దేశాల్లో కనిపించనుంది.
అయితే సూర్య గ్రహాన్ని నేరుగా చూడటం సురక్షితం కాదు. ఎందుకంటే ఫిల్టర్ చేయని UV కిరణాలు నేరుగా కళ్లకు తాకి రెటీనా పొరకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. గ్రహణాన్ని వీక్షించడానికి కెమెరాలు, టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేదా ఇతర ఆప్టికల్ పరికరాలను ఉపయోగించడం కూడా మీ కళ్ళకు హాని కలిగించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.