
Sirimanothsavam: కాలిలో ముళ్లు గుచ్చుకుంటే మనం విలవిలాడిపోతాం.. అలాంటిది అక్కడ జాతరలో పూజారి గుట్టగా వేసిన ముళ్ళకంపలపై ఎక్కి ఏకంగా పడుకునే తంతు.. గాలిలొ పొడవాటి కర్రపై పూజారిని కట్టి వలయాకారంలో తిప్పడం వంటి వింత ఆచారాలు నిండుగా ఉండే వెరైటీ జాతర చూడాలంటే మాత్రం అనంతపురం జిల్లా బెలుగుప్ప తాండా కు వెళ్లాల్సిందే.. తరతరాలుగా తండాలో వైభవంగా జరిగే మారెమ్మ జాతర చూడాల్సిందే.
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని బెళుగుప్ప తాండాలో వినూత్న రీతిలో మారెమ్మ జాతర వైభవంగా జరిగింది. సీమ సిరిమానోత్సవంగా చెప్పుకునే ఈ జాతరకు సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని గిరిజనులు, బెళుగుప్ప మండలంలోని తాండావాసులు తరలి వచ్చారు. విశేషమైన ఈ జాతరను చూసేందుకు వచ్చి అమ్మ వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం మహిళలచే పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర సిరిమానోత్సవం వరకు వెరైటీ పద్దతులు, ఆచారాలతో కన్నుల పండుగగా జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ మారెమ్మ జాతరలో ఆలయ పూజారి గుట్టగా వేసిన ముళ్ళకంపలపైకి ఎక్కుతూ వెళ్లి.. అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ పదునైన ముళ్ళపై పడుకొంటాడు.
ఒళ్ళు గగుర్పొడిచే ఈ సన్నివేశం, డప్పుల శబ్దాలు భక్తుల కేకల మద్య నడిచే ఒక ప్రధాన ఘట్టం. అలాగే ఒక పొడవాటి కర్రకు ముందు చిన్న పల్లకి ఉంచి పూజారిని కట్టి గాలిలో వలయాకారంలో ఆకాశంలో తిరిగేలా చేస్తారు. అలా గాలిలో తిరుగుతూ చేతిలో కత్తితో విన్యాసం చేస్తూ ప్రదర్శించే హావభావాలతో ఆసక్తికర ఘట్టాలు, సాంప్రదాయంగా కొన్ని తరాలుగా వస్తోన్న ఈ వింత ఆచారాన్ని చూడటం కోసం భక్తులు అనేక ప్రాంతాల నుండి తరలి వస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..