Sindhu Pushkaram: భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. మనదేశంలో నదులను దేవతలుగా పూజిస్తారు. గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు మనదేశంలో ప్రవహిస్తూ సస్యశ్యామలం చేస్తున్నాయి. మన దేశంలో నదీనదాలంటే కేవలం నీటి ప్రవాహాలు కావు అవి దేవతా స్వరూపాలు. అలాంటి పుణ్యవాహిని ఒకటి సింధూ నది. ఈ నదీమ తల్లి పుష్కర శోభను సంతరించుకోనుంది. కార్తీక మాసం కృష్ణ పాడ్యమి రోజున అంటే ఈ నెల 20వ తేదీ శనివారం సింధు నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
దేవ గురువు బృహస్పతి కుంభరాశిలోకి నవంబర్ 20వ తేదీన ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజునుంచి సింధు నదికి పుష్కరాలు ప్రారంభమయ్యి.. డిసెంబర్ 1వ తేదీ వరకూ పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర సమయంలో సింధు నదిలో స్నానం పుణ్యప్రదం. పితృదేవతల ప్రీత్యర్థం తర్పణ, పిండ ప్రదాన, దానధర్మాలు చేయడం పుణ్యప్రదమని భక్తుల నమ్మకం.
సింధు నది టిబెట్‌లోని మానస సరోవరం, కైలాసంలో పుట్టింది. ఈ నది ఇండస్ అని కూడా ఖ్యాతిగాంచింది. టిబెట్ లో పుట్టిన సింధు నది.. మనదేశంలో కాశ్మీర్ దగ్గర ఉన్న లద్దాక్ లోని డెమ్ చోక్ లో భారత్ లోకి ప్రవేశించి.. తర్వాత ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిట్ బాల్టిస్తాన్ మీదుగా ప్రవహించి ,కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధునది ఉప నదులు కశ్మీర్ లోయలో ప్రవహిస్తాయి. రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, జీలం నదులు సింధు నదికి ఉపనదులే. లద్దాఖ్‌లోని లేహ్, శ్రీనగర్ సమీపంలోని గంధర్‌బాల్ ప్రాంతాల్లో సింధూ నది పుష్కరాలు జరగనున్నాయి.
ఒక్కో నదిలో ఏడాది చొప్పున 12 పుణ్యనదుల్లో పుష్కరుడు నివాసం ఉంటాడు కాబట్టి, ప్రతి నదికీ 12 ఏళ్లకోసారి మనకు పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వస్తే దేవతలకే కాదు, నదులకూ గొప్ప పండుగే.
Also Read: