హిందూ మతంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులు ఉన్నాయి.. ఒకటి చైత్ర నవరాత్రులు.. మరొకటి శారదీయ నవరాత్రులు అంతేకాదు ఏడాదిలో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటారు. శారదీయ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులను ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ 9 రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది.
ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి, ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గా అష్టమి, నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు, దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు దశమి తిథి రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని.. విశేషమైన ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం ప్రతిపద తిథి అక్టోబర్ 3న అర్ధరాత్రి 12.19 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే అక్టోబర్ 4న తెల్లవారుజామున 2.58 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం ఈ శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3, 2024 నుంచి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12, 2024 శనివారం ముగుస్తుంది.
నవరాత్రులలో మొదటి రోజు అంటే అక్టోబర్ 3న కలశ స్థాపనతో పాటు దుర్గామాత దేవి మొదటి రూపమైన శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు. ఈ సంవత్సరం ఘట స్థాపన అంటే కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీ ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉంటుంది. దీనితో పాటు కలశ స్థాపనకు మరొక శుభ సమయం ఉంది. అది అభిజిత్ ముహూర్తం. ఇది ఉదయం 11:46 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాళ కోసం కలశాన్ని ప్రతిష్టించ వచ్చు.
ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షం అష్టమి తిథి రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు. ఈ సంవత్సరం దుర్గాష్టమి అక్టోబర్ 11 శుక్రవారం వచ్చింది. ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం మహానవమి కూడా అక్టోబర్ 11 న జరుపుకుంటారు. అయితే నవమి హవనం అక్టోబర్ 12, శనివారం జరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి