Samatha Kumbh 2025: సకల జనుల సంబురం.. ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న శ్రీరామనగరం..

|

Feb 14, 2025 | 8:50 PM

సమతాకుంభ్‌ 2025 బ్రహ్మోత్సవాలు సకల జనుల సంబురంగా సాగుతున్నాయి. నిత్యక్రతువులు.. దేవతారాధనలతో ముచ్చింతల్‌ శ్రీరామనగరం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఉత్సవాల ఐదో రోజు సాకేత రామచంద్ర ప్రభువు, అశ్వవాహనంపై విహరించారు. మరోవైపు.. 18 దివ్యదేశ మూర్తులకు గరుడ సేవలు కనువిందుగా జరిగాయి.

Samatha Kumbh 2025: సకల జనుల సంబురం.. ఇల వైకుంఠాన్ని తలపిస్తున్న శ్రీరామనగరం..
Samatha Kumbh 2025
Follow us on

శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. విశేషోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన, గద్యత్రయ పారాయణము జరిగాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో గద్యత్రయ పారాయణం జరిపారు. మూడు గద్య త్రయాలు, శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, శ్రీ వైకుంఠ గద్యలను పారాయణం చేశారు. గద్యత్రయతో పాటు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ముందుగా సమతా కేంద్రం నుంచి వేదికపైకి స్వామి అమ్మవార్లను చిలుక వాహనంపై తీసుకొచ్చారు. చిన్నజీయర్‌ స్వామి స్వయంగా పూజలో పాల్గొన్నవారికి లక్ష్మీదేవి రూపు అందించారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరావు దంపతులు పాల్గొన్నారు.

ఫాల్గుణ మాసంలో వచ్చే ఉత్తర ఫాల్గుణి నక్షత్రం గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం. ఆ రోజు శ్రీరంగనాథుడు ప్రాకారాలన్నీ దాటుకుని శ్రీరంగనాయకి దగ్గరకు వేంచేసి ఆమెతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. దాన్నే శేర్తి ఉత్సవమని కూడా అంటారు. అమ్మతో చేరి స్వామి దర్శనమిచ్చే ఉత్సవం అన్నమాట. ఫాల్గుణ మాసంలో జరిగే ఉత్సవం కనుక ”పంగుని” ఉత్సవం అని అంటారు. ఆ సందర్భంలో భగవద్రామానుజులు ఆ దివ్య దంపతుల సాన్నిధ్యాన్ని ఆర్తితో సేవిస్తారు. అప్పుడు అనర్గళంగా స్తోత్రం వారి నోటివెంట వచ్చింది. అది గద్యరూపంలో ఉంది. శరణాగతి పూర్వకంగా వెలువడిన గద్య కనుక శరణాగతి గద్య అని ప్రసిద్ది చెందింది.

తర్వాత శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం జరిగింది. సాయంత్రం సాకేత రామచంద్ర స్వామి, 18 దివ్యదేశ మూర్తులకు 18 గరుడ సేవలు జరిగాయి. తిరువీధి సేవగా యాగశాలా ప్రవేశం చేశాయి. సాకేత రామచంద్ర ప్రభువు, అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. కలియుగ చివరలో శ్రీనివాసుడు కల్కి అవతారమెత్తి చెడును శిక్షించి మంచివారిని రక్షించడం ఈ వేడుక ఉద్దేశంగా చెబుతారు.

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాన్ని అధిష్టించి కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తోంది.

సుప్రభాత గోష్ఠితో కార్యక్రమాలు మొదలుకాగా.. యాగశాలలో చినజీయర్‌స్వామి మార్గనిర్దేశంలో ధ్యాన పద్ధతిని నేర్చుకున్నారు. ధ్యానం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై పూర్తి చేసుకుని వేద విన్నపాలతో యాగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారు స్వయంగా వచ్చిన భక్తులందరికీ తీర్థాన్ని అనుగ్రహించారు.

తీర్థగోష్టి పూర్తయ్యాక గురువారం సాయంకాలం గరుడ సేవలో వేంచేసిన పెరుమాళ్లకి సామూహిక తిరుమంజన సేవలు జరిగాయి. 18 మంది పెరుమాళ్లకి ఒకే వేదిక మీద తిరుమంజన సేవలు జరగటం సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రత్యేకం.

విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు..

కాగా.. మధ్యాహ్న సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రామానుజ విజ్ఞాన వేదిక కార్యక్రమం నిర్వహించారు. రామానుజ విజ్ఞాన వేదిక కార్యక్రమంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, కుల వ్యవస్థను వ్యతిరేకించారని అన్నారు. అందరిలో ఈక్వాలిటీ తీసుకురావాలని, రామానుజుల గురువుల్లో అబ్రహ్మాణులు కూడా ఉన్నారని చెప్పారు. రామానుజుల వారు 120 ఏళ్ల జీవితంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారని, దళితులకు ఆలయ ప్రవేశం చేయించారని లక్ష్మీనారాయణ అన్నారు. ఇతర మతస్తులను కూడా దగ్గరికి తీసిన మహానుభావుడు రామానుజ అని, దళితుడిని భుజాలపైకి ఎక్కించుకుని ఆలయంలోకి తీసుకెళ్లారని, దాన్నే మునివాహన సేవ అంటున్నారని చెప్పారు. మతం పూజగదిలోనే ఉండాలి, కులం గడప దగ్గరే ఆగిపోవాలి, గడప దాటాక అందరం భారతీయులం అని గుర్తించాలని లక్ష్మీనారాయణ విద్యార్థులకు సూచించారు.