Sabarimala Pilgrimage: అయ్యప్పస్వామిని భక్తులు దర్శించుకునేందుకు శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కఠిన నిబంధనలతో భక్తులను యాత్రకు అనుమతిస్తున్నారు. శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బంది రెండు టీకా డోసులు వేసుకోవడాన్ని కేరళ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. లేకుంటే.. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ చూపాలని స్పష్టంచేసింది. అయితే.. చిన్న పిల్లల దర్శనం విషయంలో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గతంలో ఇచ్చిన ఆంక్షలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయ్యప్పస్వామి దర్శనార్థం శబరిమలకు వచ్చే చిన్నారులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదంటూ కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇకపై పిల్లలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదికను చూపించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అయితే.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని.. పిల్లలను వారి వెంట ఉన్న పెద్దవారు పర్యవేక్షించాలని పేర్కొంది.
పెద్దలందరికీ.. ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని.. ఆలయంలోకి ప్రవేశించడానికి వారంతా టీకా సర్టిఫికేట్ లేదా RT-PCR నెగిటివ్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ఆలయాన్ని సందర్శించే పిల్లల తల్లిదండ్రులు లేదా పెద్దలు వారు శానిటైజర్, మాస్క్, భౌతిక దూరంతో సహా అన్ని కరోనా నియమాలను పాటించేలా చూడాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో వారే జవాబుదారీగా ఉండాలని కేరళ ప్రభుత్వం తెలిపింది. కరోనా ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Also Read: