తిరుమల వెంకన్న భక్తులకు ఇది గొప్ప శుభవార్త..ఇప్పడు నేరుగా శ్రీవారిని దర్శించుకునే అవకాశం వచ్చింది. తిరుమలలోని కంపార్టమెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా వెంకన్న దర్శనభాగ్యం కలుగుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా.. ఇప్పుడు కేవలం 6 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 80,741 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 31,581 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కానుకల రూపంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది.
ఇక, తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి రోజు అక్టోబరు 31న దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనుంది టీటీడీ. దీపావళి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. ఆ రోజు సాయంత్రం సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు.. ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..