Rama Navami: పన్నెండేళ్లకోసారి వచ్చే మహాపర్వం.. భద్రాద్రి రహస్యాలు మీకోసం..!

|

Mar 30, 2023 | 6:06 AM

రామాయణం నిత్య చైతన్యం. నిత్య నూతనం. రామాయణం అంటే రాముడి గమనం. నాడు.. నేడు.. ఏనాటికైనా రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామాలాలి మేఘా శ్యామలాలి జోలపాడుతారు.

Rama Navami: పన్నెండేళ్లకోసారి వచ్చే మహాపర్వం.. భద్రాద్రి రహస్యాలు మీకోసం..!
Seetarama Swamy
Follow us on

రామాయణం నిత్య చైతన్యం. నిత్య నూతనం. రామాయణం అంటే రాముడి గమనం. నాడు.. నేడు.. ఏనాటికైనా రామనామం మన జీవన గమనంలో ఓ భాగం. పుట్టగానే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని దీవిస్తారు పెద్దలు. ఉగ్గుపాలతోనే రామాలాలి మేఘా శ్యామలాలి జోలపాడుతారు. బుద్దిగా చదువుకుంటే రాముడు మంచి బాలుడని అభినందిస్తారు. ఇక బడిలో ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కోరలు తెల్లన. ఏనుగ మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. అనే పాఠం ప్రతీ ఒక్కరికి కంఠస్తమే. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మరి దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మన భద్రాచలం విశేషాలు.. విశిష్టతలు తెలుసా! అచ్చోట సీతారాముల కల్యాణం.. మీకోసం ఇచ్చోట భద్రాచల రామ రహస్యం.. మనకు తెలియని మన భద్రాది చరిత్రను టీవీ9 మీ ముందుకు తెస్తోంది.

ఓవైపు శ్రీరామనవమి వైభవం.. మరోవైపు ఫుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం! ఊరూ వాడా సంబరం! భద్రాద్రిలో అంబరాన్నంటుతున్న సంబరం! శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ కాంతులతో కళకళలాడే పరంధాముడు.. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంతో మరింత అనుగ్రహిస్తున్నాడు. రండి.. పన్నెండేళ్లకోసారి వచ్చే ఈ మహాపర్వం సందర్భంగా.. భద్రాద్రికి సంబంధించిన 12 రహస్యాలను తెలుసుకుందాం!

శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే;
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!!

రామ.. రెండక్షరాల ఈ పేరు ఎంతో మహిమాన్వితమైనది. ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం నుంచి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమశివాయ పంచాక్షరి నుంచి ‘మ’ అనే అక్షరాన్ని కలిపితే ‘రామా’. శివకేశవతత్వం ఇమిడివున్న ఈ నామం కన్నా అమృతం. అదిగో అల్లదివో రామో విగ్రహాన్‌ ధర్మ: అదిగో ధర్మం మూర్తిభవించిన కీర్తి.. అల్లదివో భవసాగారాన్ని దాటించే భద్రాచల శ్రీరామచంద్ర మూర్తి.

ఇవి కూడా చదవండి

దక్షిణాది అయోద్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీరామనవమి సందర్భంగా భక్తులతో పోటెత్తనుంది. అందుకు రెండు శాస్త్రీయ కారణాలున్నాయని అర్చకులు చెబుతున్నారు. అవే రాములవారిపై ప్రజలకున్న భక్తి, భద్రాచల స్థల పురాణ శక్తి.

భద్రుని తపః ప్రభావం వల్లనే భద్రాద్రి క్షేత్రం వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. భద్రుడు విష్ణుమూర్తికి పరమ భక్తుడు. ఆయన సాక్షాత్కారం కోసం కఠోర తపస్సు ఆచరించగా.. శ్రీరాముని రూపంలో విష్ణుమూర్తి భద్రుడికి దర్శనమిస్తాడు. తదనంతరం భద్రుడు గోదావరీ నదికి అభిముఖంగా ఒక ప్రదేశంలో పర్వత రూపంగా మారిపోతాడు. ఆ స్థలమే భద్రాచలం.

తన హృదయ స్థానంలో రాముడు కొలువైన ఆ పర్వతానికి భద్రాద్రి అనీ, ఆ ప్రదేశానికి భద్రాచలం అనీ పేరు వచ్చింది. భద్రాచల ఆలయంలో.. శంఖచక్రధారి అయిన రామయ్య మూలవిరాట్టును ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే – అని భాగవతంలో పోతన వర్ణించినట్టుగా.. భద్రుని తపస్సుకు మెచ్చిన నారాయణుడు వైకుంఠం నుంచి శంఖు చక్రాలతోసహా వచ్చి ప్రత్యక్షమైనట్టు పేర్కొంటారు.

అందుకే వైకుంఠ రామునిగా శంఖుచక్రాలతో నారాయణుడిగా.. ధనుర్బాణాలతో శ్రీరామునిగా.. వెరసి శ్రీరామ నారాయణునిగా భక్తకోటిని కటాక్షిస్తున్నాడు.

వైకుంఠ రాముడు..

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత మరల భూమి మీదకి వచ్చి తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.

భద్రాద్రిలో స్వామి పద్మాసనంగా.. అమ్మవారు ఎడమతొడ మీద కూర్చొని.. లక్ష్మణుడు నొల్చొని దర్శనమిస్తారు. నాలుగు చేతులు, శంఖు చక్రాలతో వెలసినందున.. భద్రాద్రి స్వామిని రామ నారాయణుడని అంటారు. వైకుంఠం నుంచి రామరూపంలో వచ్చినందున వైకుంఠ రాముడని భక్తులు విశ్వసిస్తారు.

ఓంకార రాముడు..

రామ నారాయణుడు, వైకుంఠ రాముడు, మోక్ష రాముడు, భద్రాచల రాముడు, ఓంకార రాముడిగా భక్తులు కొలుస్తారు. అకార ఉకార మకారాలకు ప్రతిబింబాలుగా శ్రీరాముడు- మధ్యలో సీతాదేవి- లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. అందుకే స్వామి ఓంకార రాముడయ్యాడు.

భద్రాచలం దేవాలయంలో సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. లక్ష్మణుడు సీతమ్మ రాముని తొడపై కూర్చొని దర్శనమిస్తారు. అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటారు, కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటారు. ఇక్కడి విగ్రహాలు కొలువుతీరి కనిపిస్తాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది.

సువర్ణ ద్వాదశ వాహనాలు..

శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల్లో నూతన వాహనాలపై సీతారాములు భక్తులను అనుగ్రహిస్తారు. సార్వభౌమ, హనుమంత, కల్పవృక్ష, సింహాసన, హంస, సింహ, గజ, అశ్వ, చంద్రప్రభ, సూర్యప్రభ, గరుడ, శేష వాహనాలపై ఆ జగదభిరాముడు భక్తులకు కరుణిస్తాడు.

ఇంతవరకూ.. శ్రీరామదాసు కాలంలో తయారు చేయించిన వాహనాలతోనే శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామి వారికి వాహన సేవలు అందుతున్నాయి. ఇకపై నూతనంగా తయారు చేయించిన సువర్ణ ద్వాదశ వాహనాలతో స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలు కొనసాగనున్నాయి. ఆలయ స్థానాచార్యులు కేఈ స్థల సాయి ఆధ్వర్యంలో అంకురార్పణ, వాహన ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

భక్త రామదాసు..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కంచర్ల గోపన్న.. పాల్వంచకు తహసీల్దారుగా ఉన్న సమయంలో భద్రాద్రి రామాలయం నిర్మాణానికి రూ. 6 లక్షలు వెచ్చించారు. ఇదే సమయంలో భద్రాద్రి రాముడికి దప్పిక వేస్తే.. కీర్తనలనే అమృతాన్ని తాగించిన మహనీయుడు భక్తరామదాసు.

కంచర్ల గోపన్న.. భక్త రామదాసుగా చరితార్ధులు. రాముడిపై అచంచలమైన భక్తి భావంతో ఎన్నో అమూల్యమైన అజరామరమైన కీర్తనలను రచించి.. గానం చేసి తరించారు. వేద మంత్రాలు స్వామికి ఎంత ఆనందాన్ని ఇస్తాయో రామదాసు కీర్తనలకు సైతం స్వామి అంతగా ఆనందిస్తారు.

తూము నరసింహదాసు..

ఇక తూము నరసింహదాసు మరో భక్తాగ్రేసరులు. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. ఆలయాన్ని అభివద్ధి పథంలో నడిపి.. రామదాసు ఆశయాలను నెరవేర్చారు తూము నరసింహదాసు. ఆగమ, వైష్ణవ సంప్రదాయాలను కొనసాగించి.. పది రకాల ఉత్సవాల సంకీర్తనలతో ఆరాధనలు జరిగేలా చేశారు.

భద్రాది మ్యూజియం..

భద్రాచలం దగ్గరి భద్రిరెడ్డిపాలెంలోని శబరి వర్గం పోకల దమ్మక్క మొట్టమొదట రాముడికి పందిరి వేసి భక్తితో కొలిచింది. నేలకొండపల్లి గ్రామంలో జన్మించినవాడు కంచర్ల గోపన్న. ఆయన మేనమామలు అక్కన్న, మాదన్న గోల్కొండ కోట నవాబు తానీషా వద్ద మంత్రులుగా ఉండేవారు. వారు గోపన్నను సమీప పరగణాకు అధికారిగా నియమిస్తారు. అప్పుడు ఆయన శ్రీరాముడి విగ్రహాన్ని దర్శించుకొని, అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పిస్తాడు.

రామయ్య కలలోకి వచ్చి..

భద్రాచలంలో రామయ్య ఆలయ నిర్మాణానికి సంకల్పిస్తాడు కంచర్ల గోపన్న. గోపురం, ప్రాకారం, అంతరాలయ నిర్మాణాలకు చాలా ఖర్చవుతుంది. అంతేకాక చింతాకు, పచ్చల పతకాలు, కిరీటాలు, ఇతర ఆభరణాలు అనేకం చేయిస్తాడు. కల్యాణంతో పాటు స్వామికి ఉత్సవాలు జరిపించడంతో.. ప్రభుత్వ ధనం వాడుకున్నాడంటూ గోపన్నను తానీషా కారాగారంలో బంధిస్తాడు.

పన్నెండేళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవించిన గోపన్న.. కారాగారంలో అనేక కీర్తనల్ని ఆశువుగా ఆలపిస్తాడు. దాశరథీ శతకాన్ని రచిస్తాడు. ఆ భక్తికి మెచ్చిన రామలక్ష్మణులు.. తానీషాకు దర్శనమిచ్చి.. బంగారు మొహరీలతో బాకీ తీర్చారని చెబుతారు. అప్పటినుంచి అందరూ గోపన్నను రామదాసుగా కీర్తించారు. ఇప్పటికీ ఆ నాణేలు.. భద్రాచలం ఆలయంలో చూడవచ్చు!

సుదర్శన చక్రం ఎవరూ తయారు చేసినది కాదు..

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారు చేసినది కాదు. మరి ఇది ఎలా వచ్చిందంటే.. భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి.. వారిచేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో, లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.

సుదర్శన చక్రం గురించి కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ‘భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది. దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను. అది గోదావరిలో ఉంది. తెచ్చి ప్రతిష్ఠించు’ అని చెప్పాడుట! మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు. కానీ కనిపించలేదు. మళ్లీ రాముడు కలలో కనిపించి ‘అది నామీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది’ అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి.. గోదావరిలో చేతులు పెట్టగా..ఆ సుదర్శన చక్రం వచ్చి చేతిలో నిలచింది. ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు గర్భగుడి పైభాగన అలరారుతున్న సుదర్శన చక్రం!!

శ్రీరామక్షేత్రానికి శ్రీరంగం ఆదర్శం..

భద్రాచల శ్రీరామక్షేత్రానికి శ్రీరంగం ఆదర్శం! అవును.. శ్రీరఘునాథ్‌ భట్టార్‌ ఆచార్యుల ద్వారా తారకమంత్రోపదేశాన్ని పొందిన శ్రీరామదాసు..శ్రీరంగంలో జరిగే ఉత్సవాల ఆచార వ్యవహారాలను భద్రాద్రిలో ఏర్పాటు చేశారు. 108దివ్యక్షేత్రాల్లో విశిష్ట క్షేత్రం శ్రీరంగం. భగవద్రామానుడు విశిష్టాద్వైతాన్ని విశ్వవ్యాప్తం చేసింది శ్రీరంగం కేంద్రంగానే. శ్రీరంగానికి- భద్రాచల క్షేత్రానికి ఎంతో సారూప్యత వుంది. భగవద్రామానుజ ముద్రను భద్రాచలం తీసుకొచ్చిన ఘనత భక్త రామదాసులవారిది.

పంచరాత్ర ఆగమ సిద్దాంతాలు తెలిసిన ఐదు కుటుంబాలను శ్రీరంగం నుంచి ఇక్కడకు తీసుకొచ్చారు రామదాసుజ. శ్రీరంగం ఆలయ వ్యవస్థను యథాతథంగా ఇక్కడ స్థాపించారు. శ్రీరంగం మాదిరిగానే ఎత్తైన కొండ మీద దక్షిణాభిముకంగా శ్రీరంగనాథుడ్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ కొండను ఇప్పటికీ రంగనాయకుల గుట్టగానే పిలుస్తారు. శ్రీరంగంలో మాదిరిగానే లక్ష్మీతాయరు సన్నిధి ఏర్పాటు చేశారు.

మిథిలా స్టేడియం..

భద్రాచల ఆలయానికి అనుంబంధంగా ఉన్న మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపం అద్భుతం! ప్రతి సంవత్సరం మిథిలా కల్యాణ మండపం వేదికగా.. సీతారాముల కల్యాణం జరుగుతుంది. ఆరు దశాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ కట్టడం.. అపురూప శిల్ప సౌందర్యానికి నిలయం. అంతేకాదు, ఈ శతాబ్దంలోనే నిర్మించబడిన అద్భుత కట్టడాలలో ఒకటిగా చరిత్రకెక్కింది.

రామాయణంలోని ప్రధాన ఘట్టాలను, రామదాసు భద్రాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను ఈ కళ్యాణ మండపంపై చెక్కారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రముఖ శిల్పకళాకారుడు గణపతి స్తపతి ఈ మిథిలా స్టేడియాన్ని నిర్మించగా రామాయణంలోని ప్రధాన ఘట్టాలను గణపతి స్తపతి తన శిల్పకళా నైపుణ్యంతో మండపంపై అద్భుతంగా తీర్చిదిద్దారు. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తూ ఈ కళ్యాణ మండపముపై చెక్కిన శిల్పాలు నేటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మండపం పైభాగంలో ఉన్న రాసి చక్రం.. గణపతి స్తపతి కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. దాదాపు 20 వేల మంది ఒకే చోట కూర్చొని భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా ఐదు ఎకరాల స్థలంలో మిథిలా స్టేడియాన్ని నిర్మించారు.

పట్టాభిషేక వైభవం..

దేవతలందరిలో పట్టాభిషేక వైభవం ఒక్క శ్రీరాముడికే ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మర్నాడు దశమి రోజు పట్టాభిషేకం జరుగుతుంది. భద్రాచలంలో అరవై ఏండ్లకు ఒకసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించే సంప్రదాయం ఉంది. 1987 ప్రభవ నామ సంవత్సరంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించారు. అరవై ఏండ్లకు ఒకసారి జరిగే ఈ అద్భుత మహోత్సవాన్ని చూసేందుకు 1987లో భద్రాద్రి భక్తులతో కిటకిటలాడింది.

ఈ మహోజ్జ్వల సన్నివేశాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే వీలు ఉండేది. అయితే, ఈ అవకాశం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా గురువారం స్వామివారి కల్యాణం కన్నుల పండుగ.. మరుసటి రోజైన శుక్రవారం పుష్కర పట్టాభిషేకం జగతికి వేడుక!! పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా.. సమస్త నదీ జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. రామచంద్రుడికి రాజలాంఛనాలతో పట్టాభిషేకం చేస్తారు. ఈ అద్భుత క్రతువులో పాలుపంచుకొని, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకంతో వెలిగిపోతున్న రాముడిని దర్శించుకోవడం భక్తులు జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు.

ఈ క్రమంలో 2011లో మొదటి పుష్కర పట్టాభిషేకానికి నాంది పలికారు. మళ్లీ 12 సంవత్సరాలకు.. ఈ ఏడాది పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి భద్రాచలం ముస్తాబయింది. ఈ క్రమంలో స్వామివారికి నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పారాయణాలు, జప, హోమాలు నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..