Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునాదుల నిర్మాణానికి సంబంధించిన పనులు ఈ నెలాఖరుకల్లా ముగియనున్నాయి. 2023 డిసెంబరు నుంచి భక్తులకు రామాలయ దర్శనానికి అనుమతించనున్నారు. ఆ మేరకు దీపావళి వేళ అయోధ్య రామాలయ నిర్మాణపనులు పర్యవేక్షిస్తున్న విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత గోపాల్ భక్తులకు తీపి కబురు చెప్పారు. రామమందిర పునాదుల నిర్మాణానికి సంబంధించిన పనులు తుది దశకు చేరినట్లు ఆయన తెలిపారు. ఈ పనులు మరో 15 రోజుల్లో పూర్తవుతాయని వెల్లడించారు. మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసుకుని.. 2023 డిసెంబరులో భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. అప్పటిలోగా ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు వివరించారు.
పునాధి పనులను 40 అడుగుల లోపల నుంచి చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెలాఖరులో పునాధుల నిర్మాణల పనులు ముగిసిన తర్వాత.. ఆలయ ఫ్లోర్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీని కోసం మీర్జాపూర్, బెంగళూరు నుంచి మేలురకం మార్బల్స్, గ్రానైట్ రాళ్లను ప్రత్యేకంగా ఇక్కడకు తెప్పిస్తున్నట్లు వివరించారు. ఆలయ గోడల నిర్మాణం కోసం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి మేలురకం రాళ్లను తెప్పిస్తున్నట్లు తెలిపారు.
అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. 2.77 ఎకరాల విస్తీర్ణంలో 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో మందిరాన్ని నిర్మించనున్నారు. ఆలయానికి ఐదు గోపురాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో అతిపెద్ద గోపురం ఎత్తు 161 అడుగులుగా ఉంటుంది. మూడు అంతస్థులుగా ఆలయం ఉండబోతుంది. ఒక్కో అంతస్థు ఎత్తు 20 అడుగులుగా ఉంటుంది.
గత ఏడాది ఆగస్టు 5న జరిగిన అయోధ్య రామాలయ భమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం తెలిసిందే.
Also Read..