TTD: క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయ్.. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

|

Jun 26, 2022 | 1:43 PM

తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు రద్దీగా....

TTD: క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు నిండిపోయాయ్.. భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
Rush In Tirumala
Follow us on

తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు రద్దీగా మారాయి. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 20 గంటలకుపైగా సమయం పడుతోందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు. కాగా.. సెప్టెంబర్ కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ నెల 27న (రేపు) సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్నాయి. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన భక్తులు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది. తోమాల, అర్చన, సుప్రభాతం, అష్టదళ పాద పద్మారాధన టికెట్లను ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. టికెట్లు పొందినవారి జాబితాను ఈనెల 29 మధ్యాహ్నం 12 గంటల తరువాత వెబ్‌సైట్‌లో వివరాలు వెల్లడిస్తారు. భారీగా నెలకొన్న రద్దీతో గదుల కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం 71,589 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. హుండీలకు రూ.4.30 కోట్లు ఆదాయం వచ్చింది.

మరోవైపు.. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీచేయలేమని టీటీడీ చేసిన ప్రకటన తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌ 12 వరకు తిరుపతిలో టైమ్‌స్లాట్‌ టోకెన్లు జారీ చేశారు. రద్దీ భారీగా ఉండటంతో అక్కడ తోపులాట జరిగింది. అప్పటినుంచి తిరుమలకు నేరుగా సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే గదులు అందుబాటులో ఉండటంతో వసతికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..