హిందూ మతంలో దేవతలను ఆరాధించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భగవంతుడిని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత, దేవతామూర్తుల విశేష ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. అనేక రకాల మతపరమైన ఆచారాలు, పూజలు, హారతి, ఉపవాసాలు దేవుని ఆరాధన విధానాలుగా పేర్కొన్నారు. దేవుని పూజలో పువ్వులు ఖచ్చితంగా వినియోగిస్తారు. పువ్వులు లేని దేవుడి పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దేవుడి పూజలో పువ్వులు ఉపయోగించినప్పుడు.. సువాసన రూపంలో సానుకూల శక్తి ప్రభావం.. మంచి తరంగాల ప్రభావం చుట్టూ వ్యాపిస్తుంది. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భగవంతుడికి పువ్వుల సువాసన అంటే చాలా ఇష్టం. ఈ కారణంగా, పువ్వులు లేకుండా దేవతల పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. దేవుడికి పూలు సమర్పించడం ద్వారా భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి. దేవతలను ఎప్పుడూ పూలతో అలంకరించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. హిందూ మతంలో.. ఒకొక్క దేవుడికి ఒకొక్క పువ్వు ఇష్టంఅని.. వాటితో పూజలు చేయడం ద్వారా.. దేవుడు సంతోషపడతాడని ఓ నమ్మకం. ఇలా పూజలను చేయడం ద్వారా పూజ ఫలితం అనేక రెట్లు పెరుగుతుందని విశ్వాసం. ఈ రోజు ఏ పువ్వు ఏ దేవతకు ప్రీతిపాత్రమో తెలుసుకుందాం.
గణేశుడు
అన్ని దేవతలలో మొదటిగా పూజలను అందుకునే దేవుడు గణేశుడు. గణేశుడి పూజలో దర్భ గడ్డికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పచ్చని దర్భ గడ్డి వినాయకుడికి చాలా ప్రీతికరమైనది. తులసి ఆకులు మినహా అన్ని రకాల పుష్పాలను విఘ్నాలకధిపతి వినాయకుడికి సమర్పించవచ్చు.
శివుడు
శివుడిని భోలాశంకరుడు అని పిలుస్తారు. ఎందుకంటే శివయ్య కేవలం జలంతో అభిషేకించినా సంతోషిస్తాడు. శివుని ఆరాధనలో బిల్వపత్రాలు, తెల్లని పువ్వులు, గన్నేరు, శంఖం పువ్వులు, బిల్లగన్నేరు వంటి పుష్పాలతో పూజిస్తారు. అయితే శివుడిని శాస్త్రాల ప్రకారం, తులసి, మొగలి పువ్వులతో పొరపాటున కూడా పుజించకూడదు.
శ్రీ హరి
తులసి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసిని హరి ప్రియ అని కూడా అంటారు. శ్రీ హరికి తులసి దళాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సులభంగా ప్రసన్నులవుతారు. ఇది కాకుండా తామరపువ్వు, కదంబ, మల్లెపూలు, బంతి, చామంతి, శంఖం వంటి పువ్వులను కూడా విష్ణువుకు సమర్పించివచ్చు.
లక్ష్మీదేవి
లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. ఎవరైనా లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకుంటే ఆ ఇల్లు సిరి సంపదలు, ధాన్యాలతో నిండి ఉంటుందని విశ్వాసం. తామర పువ్వు శ్రీ మహా లక్ష్మికి చాలా ప్రీతికరమైనది.
సూర్య దేవుడు
ప్రత్యేక్ష భగవానుడు సూర్యుడు.. ఉదయాన్నే సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి పూజించడం వల్ల గౌరవం, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మందార, ఎర్ర కమలం, ఎర్ర గన్నేరు, బంతి పువ్వులను సమర్పించడం శ్రేయస్కరం.
శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు విష్ణువు అవతారంగా భావిస్తారు. కన్నయ్యను ప్రసన్నం చేసుకోవడానికి పారిజాతం, సంపంగి, వనమాల పుష్పాలను సమర్పిస్తారు. తులసి దళం అంటే చాలా ఇష్టం.
మంగళ గౌరీ
గౌరమ్మకు ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా శివునికి ప్రీతిపాత్రమైన పుష్పాలు గౌరీమాతకి కూడా ప్రీతికరమైనవి.
దుర్గాదేవి
దుర్గమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆమెకు ఎరుపు రంగు పువ్వులు సమర్పిస్తారు. మందార , గులాబీ పువ్వులు దుర్గమ్మకు చాలా ఇష్టమైనవి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)