Ratha Sapthami 2021: రథ సప్తమికి ముస్తాబవుతున్న తిరుమలగిరులు.. భారీగా తరలిరానున్న భక్తులు..

|

Feb 17, 2021 | 9:17 PM

కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై రథసప్తమికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 19న ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు.

Ratha Sapthami 2021: రథ సప్తమికి ముస్తాబవుతున్న తిరుమలగిరులు.. భారీగా తరలిరానున్న భక్తులు..
Follow us on

కలియుగ వైకుంఠమైన తిరుమల కొండపై రథసప్తమికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 19న ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహన సేవలపై సప్తగిరీశుడు దర్శనమివ్వనున్నారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే ఈ ఉత్సవానికి భక్తులు భౌతిక దూరం పాటిస్తూ వాహన సేవలు తిలకించేలా టీటీడీ ఏర్పాటు చేసింది.  కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే టీటీడీ తిరుమలకు అనుమతించనుంది.

సూర్యజయంతిని పురస్కరించుకుని 19న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు టీటీడీ విసృత ఏర్పాట్లు చేసింది. సుర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్త వాహన సేవలపై శ్రీవారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం ఐదున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభవాహనం మీద సూర్యనారాయణమూర్తిగా దర్శనమిచ్చిన అనంతరం తొమ్మిది గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంతవాహనం, రెండు గంటలకు చక్రస్నానం, నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం, ఆరు గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో చక్రస్నానాన్ని భక్తులను అనుమతించకుండా పుష్కరిణీలో ఏకాంతంగా నిర్వహిస్తారు. వాహన సేవలు జరిగే తిరుమాడవీధులను అందంగా తీర్చిదిద్దారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకునే విధంగా తిరువీధుల్లో గ్యాలరీలను నిర్మించారు. మాడవీధుల్లో ముగ్గులు వేసి పండుగ వాతావరణం కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. స్వామివారు విహరించే వాహనాలకు మరమ్మతులు చేసి సిద్ధం చేశారు.  ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా అన్నపానీయాలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.  రథసప్తమిని పురస్కరించుకుని 19న శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Also Read:

Vasantha Panchami 2021: వసంత పంచమి విశిష్టత… సరస్వతి దేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలే..