PM Narendra Modi’s visit to Statue of Equality: సమతామూర్తి శ్రీరామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోడీ టూర్ షెడ్యూల్(PM Modi Tour Schedule) ఖరారయింది. మొత్తం రెండు గంటలకు పైనా హైదరాబాద్(Hyderabad) మహానగర శివారులోని చిన జీయర్ స్వామీ(China Jiyar Swamy) ఆశ్రమంలో ప్రధాని మోడీ గడపనున్నారు. సమతామూర్తి విగ్రహం(Statue of Equality) ఆవిష్కరణతో పాటు.. ప్రజలకు సందేశాన్ని ఇస్తారు. దీంతో ఆశ్రమంలో ఎస్‌పీజీ దళాలతో భద్రతను కట్టుదిట్టంచేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం పరిసరాలను SPG కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అటు.. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో కూడా ప్రధాని పాల్గొంటారు.
శ్రీరామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆకాశమే హర్షించేలా- భూమితల్లే పులకించేలా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన సమతామూర్తి విగ్రహవిష్కరణకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ నెల 5న హైదరాబాద్‌కు వస్తున్న మోడీ.. సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌కు చేరుకుంటారు. 5గంటల 15నిమిషాలకు యాగశాలకు చేరుకొని.. దాదాపు 15 నిమిషాల పాటు ఉంటారు. అటు తర్వాత ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు విశ్వక్షేణ పూర్ణహుతి క్రతువులో పాల్గొంటారు. 6గంటల నుంచి ఆరున్న వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. 6 గంటల 45 నిమిషాలకు సమతామూర్తి విగ్రహం దగ్గరికి చేరుకొని.. ఏడు గంటల వరకు ప్రత్యేక పూజలు చేస్తారు. 7 గంటలకు ప్రధాని తన సందేశాన్ని ఇస్తారు.
ప్రధాని నరేంద్రమోడీ భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. బీఆర్కే భవన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఏర్పాట్ల గురించి చర్చించారు. మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తుకు బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే, వీవీఐపీల పర్యటన సందర్భంగా కొవిడ్ 19 ప్రొటోకాల్ పాటించేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మత్తు చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను సీఎస్ ఆదేశించారు. వీవీఐపీలు సందర్శించే అన్ని ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యాత్ శాఖ అధికారులకు సూచించారు.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ముచ్చింతల్‌లోని చిన జీయర్ స్వామి ఆశ్రమంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం పరిసరాలను SPG కమాండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ ప్రాంగణంపై ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఆశ్రమంలో ఉన్న సెక్యూరిటీని కూడా పరిశీలించారు. ఈ ఆవరణను మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు భద్రతా సిబ్బంది. ఇప్పటికే ప్రతిరోజు 30 మంది సాయుధులైన కమాండోలు 24 గంటల పాటు నిరంతరం పహారాలో ఉంటున్నారు. మరో వైపు ప్రధాని భద్రతాధికారులకు ఏర్పాట్లను అన్నింటనీ చూపించారు చినజీయర్ స్వామి, మైహోం అధినేత రామేశ్వరరావు. సెక్యూరిటీ పరంగా చిన్నపాటి సూచనలు చేశారు అధికారులు. వీటిని పరిగణలోకి తీసుకున్నామని అన్నారు చినజీయర్ స్వామి.
అటు.. హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలకు కూడా హాజరవుతున్నారు ప్రధాని మోదీ. ఈ టూర్ నేపథ్యంలో.. SPG టీమ్స్, భద్రతాధికారులు ఇక్రిశాట్ పరిశరాలను పరిశీలించారు. ఏరియల్ సర్వే కూడా చేసి.. భద్రతా ఏర్పాట్లను చూశారు.