Parama Ekadashi: పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ ఐశ్వర్యం, కోరికల సిద్ధి!
Purushottam Maas Parama Ekadashi: పురుషోత్తమ మాసంలో గురువారం వచ్చే పరమ ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. ఈ అరుదైన ఏకాదశి ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. విష్ణువును పూజించడం, ఉపవాసం పాటించడం ద్వారా కష్టాలు తొలగి, భోగభాగ్యాలు, కోరికల సిద్ధి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. పూజా నియమాలు, చేయాల్సిన, చేయకూడని పనులను ఈ రోజు పాటించడం విశేష ఫలితాలనిస్తుంది.

పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశికి అపారమైన శక్తి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 11వ తేదీన గురువారం నాడు ఏర్పడే పరమ ఏకాదశి మరింత ప్రత్యేకమైనది. ఈ అరుదైన ఏకాదశి ప్రతి మూడేళ్లకొకసారి మాత్రమే వస్తుంది. అధిక మాసంలో, గురువారంతో కలిసి వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర దినాన విష్ణుమూర్తిని, ఆయన స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి జీవితంలో కష్టాలు తొలగి, భోగభాగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని ప్రగాఢ నమ్మకం.
పూజా విధానం, నియమాలు:
ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, ముగ్గు వేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకుని, పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసి, దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభకరం. పూజ చేసే స్త్రీలు కాళ్ళకు పసుపు, కుంకుమ ధరించడం తప్పనిసరి.
వెంకటేశ్వర స్వామి పూజలో తులసి దళాలు తప్పనిసరి. కొన్ని తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే తులసి ఆకులు లేకుండా ఏ పూజ చేసినా సంపూర్ణ పుణ్యఫలితం లభించదు. ఈ రోజున రెండు తులసి ఆకులు సమర్పించినా కోరిన కోర్కెలు నెరవేరుతాయి. పూజకు ముందు అక్షింతలు, రాగి చెంబులో నీళ్లు సిద్ధం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించి, తులసి మాల వేసి నమస్కరించాలి. మాల వేయలేని వారు పాదాల వద్ద రెండు తులసి ఆకులు ఉంచవచ్చు.
పిండి దీపాలు, మంత్ర జపం:
ఈ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించడం విశేషం. బియ్యప్పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి రెండు ప్రమిదలు తయారు చేయాలి. వీటికి కుంకుమ బొట్లు పెట్టి, ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి వెలిగించాలి. ఈ పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని 108 లేదా 21 సార్లు జపించాలి. స్వామివారికి అరటి పండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి, లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది. చివరగా ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి, మూడు ప్రదక్షిణలు చేసి, అక్షింతలు వేసుకుని మనసులోని కోరికలు చెప్పుకోవాలి.
ఉపవాసం, నిషేధాలు:
ఏకాదశి రోజున స్త్రీలు ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కఠిన ఉపవాసం సాధ్యం కానివారు పాలు, పండ్లు స్వీకరిస్తూ సాయంత్రం భోజనం చేయవచ్చు. ఈ రోజు ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడని, అన్నం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుని, వచ్చే జన్మలో పురుగులా పుడతారని నమ్మకం. అందుకే అన్నం తినకుండా ఉపవాసం ఉండాలి.
ఈ రోజు తలకు నూనె రాయడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు, ఇది అప్పుల బాధలను పెంచుతుందని నమ్మకం. అలాగే వంకాయ, మునగకాయ, చిక్కుడు కాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం నిషేధం.
ప్రత్యేక పరిహారాలు, ప్రయోజనాలు:
సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి. పసుపు కొమ్ములు లేదా పసుపు కొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంటికి కలిసి వస్తుంది.
- ఆలయ సందర్శన: వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది.
- అప్పుల సమస్యలు: రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేసి, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది.
- సుమంగళీ యోగం: తులసి కోటను పూజించి, దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆడవారికి సుమంగళీ యోగం కలుగుతుంది.
- గృహ దోషాలు: ఇంటి గుమ్మంపై గోమూత్రం చల్లితే నరదిష్టి, వాస్తు దోషాలు తొలగి అఖండ ధనాకర్షణ కలుగుతుంది.
- సంతాన ప్రాప్తి: నల్ల ఆవుకు ఐదు అరటి పండ్లు తినిపిస్తే సత్వరమే సంతానం కలుగుతుంది.
- దారిద్ర్య నివారణ: శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తి విగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.
- ఉద్యోగ ప్రాప్తి: విష్ణుమూర్తి దేవాలయానికి పసుపు రంగు వస్త్రాలు సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.
- గురు బలం: ఆవు నెయ్యి కలిపిన అక్షింతలతో విష్ణు సహస్రనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి అర్చన చేస్తే జాతకంలో గురు బలం పెరుగుతుంది.
- ఐశ్వర్యం కోసం: విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో ఉత్తర ముఖంగా పెట్టుకుంటే కుటుంబానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
- లక్ష్మీ ఆగమనం: రాగి చెంబులో నీళ్లు తీసుకుని విష్ణు గాయత్రీ మంత్రం (“ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్”) జపించి, ఆ నీటిని ఇల్లంతా చిలకరిస్తే దరిద్ర దేవత వెళ్లిపోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.
- అన్నదానం: పేదలకు అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.
ఈ పరమ పవిత్రమైన ఏకాదశిని నియమనిష్టలతో ఆచరించి, విష్ణువు కృపకు పాత్రులై సకల శుభాలు పొందగలరు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




