Brahmamgari Matam Controversy: సమసిందనుకున్న వివాదం మరో మలుపు తిరిగింది. సమస్యను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తిపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రహ్మంగారి మఠం గొడవలో కులం చొరబడింది. సంప్రదింపుల పేరుతో మభ్యపెడుతున్నారంటూ పోలీసులకే ఫిర్యాదు చేసింది వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ లక్ష్మమ్మ.
కడప బ్రహ్మంగారి మఠాధిపతి వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు భార్యల వారసుల్లో హక్కు ఎవరన్నదానిపై రగడ నడుస్తుంటే.. చివరికి కేసులదాకా వెళ్తోంది. కుటుంబసభ్యుల మధ్య సయోధ్యకు ప్రయత్నించిన శివస్వామిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు వీరభోగవెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ లక్ష్మమ్మ. మొదటి భార్య కుమారుడిని మఠాధిపతిని చేయడానికి శివస్వామి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వీలునామా ప్రకారం తన కుమారుడు గోవిందానందే మఠాధిపతి కావాలని.. చర్చల పేరుతో పిలిచి తమను శివస్వామి మోసగించారని ఆమె ఆరోపించారు.
శివస్వామి శనివారం బ్రహ్మంగారి మఠానికి రాకుండా చూడాలని డీజీపీని మారుతిలక్ష్మమ్మ కోరారు. వెంకటాద్రి స్వామి ఆధ్వర్యంలో కొంతమంది స్థానికులు, అసాంగిక శక్తులతో కలిసి తరుచూ మఠంపై దాడి చేస్తున్నారని ఆరోపించారారు. డిప్యూటీ కమిషనర్ తమ మఠం సందర్శించినప్పుడు కనీసం కరోనా నిబంధనలు పాటించలేదని విమర్శించారు. అలజడి సృష్టించారని ఆమె లేఖలో తెలిపారు.
బ్రహ్మంగారి మఠాధిపతి వివాదంలో రాజీ కుదిర్చేందుకు వివిధ పీఠాధిపతులు ప్రయత్నించినా సమస్య తీరకపోగా మరింత ముదురుతోంది. శివస్వామి ఆధ్వర్యంలో పీఠాధిపతులు కందిమల్లాయపాలెం వెళ్లి రెండు కుటుంబాలతో మాట్లాడారు. పీఠాధిపతి వ్యవహారంలో సూచనలు చేస్తూ దేవాదాయశాఖకు నివేదిక సమర్పించారు. అయితే, శివస్వామి బృందం నివేదికను విశ్వబ్రాహ్మణసంఘం కూడా తప్పుపట్టటంతో.. వివాదం కొత్త మలుపు తిరిగింది.
దివంగత వీరభోగ వెంకటేశ్వరస్వామి వీలునామా ప్రకారం రెండోభార్యనే మఠాధిపతిగా చేయాలంటున్నారు విశ్వబ్రాహ్మణసంఘం కన్వీనర్ గిరినాధశర్మ. శివస్వామి బృందమిచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదిస్తే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని విశ్వబ్రాహ్మణసంఘం హెచ్చరించింది. ఏ అధికారంలో శివస్వామి బ్రహ్మంగారి మఠానికి వెళ్తారని ప్రశ్నించింది. విశ్వబ్రాహ్మణ సంఘం ఆరోపణలను బ్రహ్మపథం అధ్యక్షుడు కృష్ణమాచార్య ఖండించారు. కాలజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మంగారిని ఓ కులానికో మతానికో పరిమితం చేయొద్దన్నారు. శివస్వామి ఆధ్వర్యంలో ఇరవైమంది పీఠాధిపతుల సమక్షంలో తదుపరి మఠాధిపతి ఎవరనేది నిర్ణయిస్తారంటున్నారు కృష్ణమాచార్య. మొత్తానికి మఠాధిపతి వ్యవహారంలో కొత్త వాదనలు తెరపైకి వస్తుండటంతో..చిక్కుముడి ఇప్పట్లో వీడేలా కనిపించడంలేదు.
Read Also…. NIA chargesheets: సోషల్ మీడియాలో మావోయిస్టు భావజాల ప్రచారం.. ముగ్గురు సానుభూతిపరులపై ఎన్ఐఏ చార్జిషీట్లు!