ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మంగళవారం అమ్మవారు మహిషాసుర మర్ధనీ దేవీ గా దర్శనమిస్తోంది. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్ధనీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది. దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసుర మర్ధనిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలు నశించి, సాత్విక భావం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం. సర్వదోషాలు పటాపంచలై దైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని విశ్వసిస్తారు. బుధవారంతో దసరా వేడుకలు ముగియనున్నందున ఇంద్రకీలాద్రికి భక్తులు, భవానీల తాకిడి పెరిగింది.
కాగా.. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం దుర్గాదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 వరకూ భక్తుల రద్దీ నెలకొంది. మూలానక్షత్రం తర్వాత నుంచి భక్తుల రద్దీ భారీగానే ఉంటుందని ముందుగానే అధికారులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే సోమవారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచి రాత్రి లోగా రెండు లక్షల మందికి పైగా తరలివచ్చి దుర్గాదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు.
వివిధ సేవలు, టిక్కెట్‌లు, ప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.37.25లక్షల ఆదాయం వచ్చింది. మూలా నక్షత్రం కావడంతో పరిమితంగానే టిక్కెట్లను విక్రయించారు. వచ్చిన ఆదాయంలో 90శాతం ప్రసాదాల విక్రయాల ద్వారానే రావడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి