Navaratri 2022: బాసర సరస్వతి ఆలయంలో (Basara Saraswathi Temple) శారదీయ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. శాక్తేయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించే ఉత్సవాలు ఆలయంలో 10 రోజులపాటు కన్నుల పండుగగా సాగుతాయి. నవరాత్రుల్లో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో శక్తిరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు తరలివస్తారు.
మొదటిరోజు శైలపుత్రికగా, రెండవ రోజు బ్రహ్మచారిని, మూడవ రోజు చంద్రగంట,నాలుగో రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహా గౌరీ, తొమ్మిదవ రోజు సిద్ది ధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ రెండవ తేదీన ఆలయంలో మూలా నక్షత్ర సరస్వతి పూజ నిర్వహిస్తారు. ఈ శుభ ముహూర్తాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. రద్దీ దృష్ట్యా ఉదయం 3 గంటల నుండి చిన్నారులకు నాలుగు మండపాలు అక్షర శ్రీకర పూజలు నిర్వహిస్తారు.
బాసర సరస్వతి ఆలయంలో దసరా ఉత్సవాలు విభిన్నంగా సాగుతాయి. మిగతా శక్తి స్వరూపిణి ఆలయాల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. బాసర ఆలయంలో మాత్రం అమ్మవారి మూల విగ్రహానికి మొదటి రోజు అభిషేకం నిర్వహించిన అనంతరం నవమి వరకు ఎనిమిది రోజులపాటు అభిషేకం నిర్వహించరు. సాధారణ రోజుల్లో ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకం జరుపుతారు. దసరా ఉత్సవాల్లో మాత్రం అభిషేకం జరగదు. ఉత్సవ విగ్రహానికి తొమ్మిది రోజులపాటు శక్తి స్వరూపిణి అలంకరణలు చేస్తారు. అమ్మవారి దర్శనానికి మగవారు అర్ధ శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. నవమి రోజు నవ నిర్వహించి పూర్ణాహుతి చేస్తారు. దసరా రోజు అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం నెమలి పల్లకిలో అమ్మవారిని ఆలయము, బాసర గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. శమీ పూజ, సాయంకాల పూజలు అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి. నవరాత్రుల్లో మధుకరం అనే అమ్మవారి దీక్ష చేపట్టేందుకు అధిక సంఖ్యలో భక్తులు బాసర ఆలయానికి చేరుకుంటారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలోనే ఉండి బాసర గ్రామంలో భిక్షాటన చేసి అమ్మవారిని దర్శిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..