తెలంగాణ అంటే జాతర.. వేలాది మంది ప్రజలు ఒక్కచోట కూడి మొక్కుకునే జన జాతర.. తెలంగాణలో ఇప్పుడు జాతరల సందడి మొదలైంది. నిన్న అంగరంగ వైభవంగా జరిగింది ఆదివాసీల నాగోబా జాతర. ఇక తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అంటే.. పెద్దగట్టు జాతరే.. దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్న యాదవుల పెద్దగట్టు జాతరకు సూర్యాపేట కేసారం ముస్తాబవుతోంది. జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలి ఘట్టమైన దిష్టిపూజా మహోత్సవాన్ని నిన్న అర్థరాత్రి ఘనంగా నిర్వహించారు. డప్పుల దరువులతో.. అడుగుల చప్పుళ్ళతో జనం ఉర్రూతలూగారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారంకు తరలివచ్చిన అందెనపు సౌడమ్మ దేవరపెట్టెకు పూజలు చేసి గుట్టకు తరలించారు యాదవులు. సూర్యపేట జిల్లా, దురాజ్ పల్లి గ్రామంలో కొలువై ఉన్న లింగమంతుల స్వామి జాతర ప్రతి రెండేళ్ళకోసారి జరుగుతుంది.
సమక్క సారలమ్మ జాతర తరవాత అదే స్థాయిలో ఈ జాతరకు భక్తుల ప్రవాహం ఉంటుంది. అందుకే తెలంగాణా రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా ఇది గుర్తింపు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు వస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం