Nagoba Jatara 2024: నాగోరే నాగోబా.. హస్తినమడుగు నుంచి కదిలిన శ్వేతనాగుల దండు.. అభయారణ్యంలో మహా పాదయాత్ర..

నాగశేషుడిని పూజించే మెస్రం వంశీయుల అతిపెద్ద జాతర నాగోబా ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కెస్లాపూర్ ఆలయం నుండి ప్రారంభమైన గంగా జల సేకరణ మహా పాదయాత్ర హస్తినమడుగుకు చేరింది. నిమయ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో శ్వేత నాగులా కదిలి‌ మెస్రం వంశీయులు గోదావరిలోని హస్తినమడుగుకు చేరుకుని పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరించారు.

Nagoba Jatara 2024: నాగోరే నాగోబా.. హస్తినమడుగు నుంచి కదిలిన శ్వేతనాగుల దండు.. అభయారణ్యంలో మహా పాదయాత్ర..
Nagoba Jatara
Follow us
Naresh Gollana

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 28, 2024 | 9:07 PM

నాగశేషుడిని పూజించే మెస్రం వంశీయుల అతిపెద్ద జాతర నాగోబా ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కెస్లాపూర్ ఆలయం నుండి ప్రారంభమైన గంగా జల సేకరణ మహా పాదయాత్ర హస్తినమడుగుకు చేరింది. నిమయ నిష్టలతో రాళ్లు రప్పలు దాటుతూ కొండ కోనల్లో శ్వేత నాగులా కదిలి‌ మెస్రం వంశీయులు గోదావరిలోని హస్తినమడుగుకు చేరుకుని పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాజలాన్ని సేకరించారు. అమావాస్య అర్థరాత్రి నాగశేషుడికి ఈ పవిత్ర గంగాజలాన్ని అభిషేకించడంతో ఫిబ్రవరి 9 న నాగోబా మహా జాతర ప్రారంభం కానుంది. ఐదు మండలాలు, 18 గ్రామాలు, 26 మారుమూల గ్రామాల మీదు సాగుతున్న మెస్రం వంశీయుల గంగాజల మహా పాదయాత్రపై టీవి9 స్పెషల్ రిపోర్ట్.

శ్వేత నాగులా కదిలే రూపం.. తెల్లని వస్త్రం.. దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా పదిరోజుల పాటు సాగుతున్న మహా పాదయాత్ర.. చూసేందుకు రెండు కనులు చాలవు అన్నట్టుగా మంత్ర ముగ్దులను చేస్తోంది. అదే మేస్రం వంశీయుల గంగాజల సేకరణ మహా పాదయాత్ర. ఈనెల 21 కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. 110 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగుకు చేరుకుంది. పుణ్య గోదావరికి ప్రత్యేక పూజలు చేసి పవిత్ర గంగా జలాన్ని సేకరించారు మెస్రం వంశీయులు. కాలికి పాదరక్షలు ధరించకుండా.. అత్యంత నియమనిష్టలతో సాగే ఈ గంగా జల పాదయాత్ర ఈనెల 5 న ఇంద్రవెల్లిలోని ఇంద్రదేవి ఆలయానికి చేరుకోనుంది. ఇంద్రాయి దేవత పూజ అనంతరం సకుటుంబ సపరివార సమేతంగా కెస్లాపూర్ లోని మర్రి చెట్టు వద్దకు చేరుకుంటారు మేస్రం వంశీయులు. ఈ ఘట్టంతో నాగోబా జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ప్రతి ఏడాది పుష్యమాస ఆరంభం నుండి ప్రారంభమయ్యే నాగోబా జాతర వేడుకలు.. మేస్రం వంశీయులకే కాదు ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది.

నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. పుష్యమాస అమావాస్య అర్థరాత్రి వేళ నాగశేషుడికి గంగాజలాభిషేకంతో ఈ జాతర ప్రారంభం అవుతుంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని గిరిజన మెస్రం వంశీయుల అపార నమ్మకం. పుష్య మాస అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనుల విశ్వసిస్తారు.

Nagoba Jatara 2024

Nagoba Jatara 2024

రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన కేస్లాపూర్‌ నాగోబా జాతరలో మెస్రం వంశీయుల పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్‌ పర్యవేక్షణలో 22 కితల వారు తమకు కేటాయించిన బాధ్యతలు నిర్వహిస్తారు. ఇందులో పటేల్‌, కటోడ, గాయికి, జాడియల్‌, నాయక్‌వాడి, సాంకేపాయిలాల్‌, ఎంపాలియల్‌, వాడే, సపాలి, ప్రధాన్‌, బేజిలికర్‌, హవాల్దార్‌, డివేకర్‌, ఎవితి, కోర్కార్‌, డప్‌, డాకలి, రంకం, బండే, బొడ్డిగూడియల్‌, గారుడి, కాంటేలకార్‌ కితలు ఉంటాయి. జాతర ప్రారంభం నుంచి మహాపూజ ముగింపు వరకు వీరంతా ఆలయ సమీపంలోని ప్రత్యేక గుడారాల్లో బస చేస్తూ మహాకార్యంలో భాగస్వాములవుతారు. పటేల్‌.. మహాపూజతో మొదలైన పూజ కార్యక్రమాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం వెంకట్‌రావ్‌ ఆలయ పీఠాధిపతిగా కొనసాగుతున్నారు. ప్రధాన ఘట్టమైన మహాపూజతో పాటు ఉట్నూర్‌ మండలం బుడుందేవ్‌ పూజలు ముగిసే వరకు కటోడా కీతదే కీలక పాత్ర. గాయికి, జాడియల్‌ .. కితలకు చెందిన ఈ రెండు తెగల వారు గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతోపాటు ఝరి (కలశం) కు రక్షణగా ఉంటారు. మిగతా కితలకు చెందిన వారు సంప్రదాయ పూజా కార్యక్రమాల్లో సహాయ, సహకారాలు అందిస్తూ ఐక్యంగా జాతరను ముందుకు నడిపిస్తారు.

వీడియో చూడండి..

ఈ ఏడాది నాగోబాను అభిషేకించేందుకు గంగా జలాన్ని సేకరించిన మెస్రం వంశీయులు నేడు తిరిగి కెస్లాపూర్ నాగోబా వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మహా పాదయాత్రను ప్రారంభించారు. ఈనెల 9 న అమావాస్య అర్ధరాత్రి నాగశేషుడికి గంగా జలాన్ని అభిషేకించి జాతర ప్రారంభిస్తారు మెస్రం వంశీయులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి ప్రారంభమైన గంగాజల పాదయాత్ర.. ఐదు మండలాలు, 18 గ్రామాలు , 26 మారుమూల గ్రామాల మీదు గా దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగు వరకు చేరింది. ఈ పాదయాత్ర సందర్బంగా మేస్రం వంశీయులకు ఘన స్వాగతం పలికి వారికి సేవలు చేసుకోవడం ఆదివాసీ గ్రామాల ఆచారం. ఈ ఏడాది నాగోబా మహాలయం నుండి ప్రారంభమైన గంగా జలం యాత్ర కేస్లాగూడ, గుంజాల , నాగల్ కొండ, గౌరి, గుమ్మూర్ , ఇస్లాంపూర్ , మల్లాపూర్ మీదుగా జన్నారం మండలంలోని గోదావరి నదిలోని హస్తినమడుగుకు చేరుకుంది. ప్రతి ఏడాది తమ మార్గాన్ని మార్చుకుంటూ సాగడం మేస్రం వంశీయులు ఆచారం. తమ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఆదివాసీలను ఐక్యం చేసేందుకు ఈ పాదయాత్ర తోడ్పడుతుందని భావిస్తారు మేస్రం వంశీయులు. తొమ్మిది తెగలను ఏకం చేసే జాతర కూడా నాగోబానే‌. పది రోజులకు పైగా జరిగే గంగా జలాల సేకరణ మహాపాద యాత్ర.. ఈనెల 5 న తిరిగి కేస్లాపూర్ కి చేరుకుంటుంది. ఈనెల 21 న 110 మంది మెస్రం వంశస్తులు కెస్లాపూర్ లో కంకణం కట్టుకొని ఈ పాదయాత్రకు బయలుదేరారు. గోదావరి పూజ అనంతరం తిరుగు పయనమైన మేస్రం వంశీయులు ఈనెల 5న ఇంద్రవెళ్లి మండలంలోని ఇంద్ర దేవి పూజ అనంతరం తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..