Moral Story For Kids: పూర్వకాలంలో కాలక్షేపానికి టివిలు, సినిమాలు సెల్ ఫోన్లు లేవు. అప్పట్లో పెద్దలు చెప్పే కథలే పిల్లలకు కాలక్షేపం. పెద్దలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని.. జీవితంలో బతకాలంటే.. ఎలా ఉండాలి. ఏ విధంగా నడుచుకోవాలి.. కష్టం వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి. ఎవరైనా మోసం చేయాలనీ చూస్తే సమయ స్ఫూర్తిని ఎలా ప్రదర్శించాలి వంటి విషయాలను కథల రూపంలో చెప్పేవారు. ఒక యువతి తనకు వచ్చిన కష్టాన్ని ఎలాంటి సమయ స్పూర్తితో తప్పించుకుంది .. కథను ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక చిన్న పట్టణంలో ఒక చిరువ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు. అయితే తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచాలనికైనా దిగజారతాడు. ఒకసారి చిన్న దుకాణందారుడు వడ్డీ ఇవ్వడం ఆలస్యం చేశాడు. దీంతో ఆ వడ్డీవ్యాపారి కోపంగా ఈ చిన్న దుకాణదారు ఇంటికి వచ్చాడు. తన వడ్డీ సంగతేం చేశావని నిలదీసాడు.
దీంతో ఆ దుకాణం దారుడు ఈ నెల దుకాణం సరిగా నడవనందున ఆదాయం సరిగ్గా లేదని.. త్వరలో వడ్డీ ఇస్తానని చెప్పాడు. ఆ వృద్ధుడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని తన కూతురికి చెప్పాడు. మజ్జిగతో వచ్చిన ఆ వ్యాపారి కూతుర్ని చూసిన ఈ వృద్ధ వడ్డీ వ్యాపారికి కళ్లు జిగేల్‌మన్నాయి. ఆ అమ్మాయి అద్భుతమైన అందగత్తె. దీంతో ఆ ముసలి వడ్డీ వ్యాపారికి ఓ దుర్బుద్ధి పుట్టింది. వెంటనే తన ఆలోచన అమల్లోకి పెడుతూ.. ఆ దుకాణదారుతో ఓ బేరం పెట్టాడు. ‘నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే, నీ బాకీ మొత్తం రద్దు చేస్తానని స్పష్గం చేసాడు.
ఆ వ్యాపారి ముసలివాడిని అసహ్యంగా చూసాడు. అది గమనించిన వడ్డీవ్యాపారి. దీంతో ‘సరే… నీకు రెండు అవకాశాలిస్తాను. ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. అవేంటంటే, రెండు గులకరాళ్లు ఒక సంచీలో వేస్తాను. ఒకటి నల్లది. రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచిలో నుండి ఒక రాయిని బయటకు తీయాలి. అప్పుడు నల్లరాయి వస్తే.. నీ బాకీ రద్దవుతుంది అయితే మీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం జరిపించాలి. అదే తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. కానీ నీ కూతుర్ని నాకివ్వనవసరం లేదని చెప్పాడు. ఇక చిరువ్యాపారికి కాదు అనే చెప్పే అవకాశం లేకపోవడంతో.. అంగీకరించాడు.
అయితే వ్యాపారి కూతురుకి ఇదెక్కడి న్యాయం.. ఆ వృద్ధుడిని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే.. ఇంతలో ఆ వడ్డీవ్యాపారి ఇంటి ముందు ఉన్న గులకరాళ్ల దగ్గరకు వెళ్ళాడు. అటూ ఇటూ చూసి రెండు గులకరాళ్లను తీసుకుని సంచీలో వేశాడు. అయితే ఆ రెండు గులకరాళ్లు నల్ల రంగులో ఉన్నవే తీశాడు.. ఇది ఆ యువతి చూసింది. ఏమీ తెలియనట్లు తండ్రితో పాటు.. వ్యాపారివద్దకు వెళ్లి నిల్చుంది. సంచి నుంచి ఒకరాయిని బయటకు తియ్యమని చెప్పాడు వృద్ధ వడ్డీ వ్యాపారి. దీంతో అమ్మాయి అలోచించి.. సంచిలో చేయి పెట్టి.. ఒక గులకరాయి తీసింది. అలా తీసే హడావిడిలో గులకరాయి చే జారినట్లు కిందపడేసింది. ఏమీ తెలియనట్లు అయ్యో క్షమించండి.. చేజారి పడిపోయింది. అయినా పర్వాలేదు.. సంచిలో ఉన్న రాయి బయటకు తీయండి. అప్పుడు కిందపడిన రాయి ఏ రంగుదో తెలుస్తుంది కదా అంది. దీంతో వడ్డీ వ్యాపారి పని కుడితిలో పడిన ఎలుక మాదిరి అయ్యింది. కక్కా లేక మింగా లేక.. సంచి లో ఉన్న గులకరాయిని బయటకు తీశాడు. అది నల్ల రంగు రాయి కావడంతో.. యువతి చేతి నుంచి కిందపడింది తెల్లరంగు రాయి .. అని చేసేది ఏమీ లేక బాకీ రద్దు చేసి.. ఏడవలేక నవ్వుతు అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
ఈ కథలో నీతి: ప్రతీ కష్టసమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. మెదడుకు పదును పెట్టి.. విభిన్నంగా ఆలోచిస్తే.. కష్టాన్ని దాటడానికి ఉపాయం తడుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక.. మరో అవకాశం మన ఆలోచనతో సృష్టించుకోవచ్చు.