మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? ధనయోగం కలగాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు
మనీ ప్లాంట్ ఇంటికి అదృష్టం, సానుకూల శక్తిని తెస్తుందని చాలామంది నమ్ముతారు. ఇది మానసిక ప్రశాంతతను అందించి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతారు. అయితే, సరైన దిశలో ఉంచకపోతే నష్టాలు కలుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనీ ప్లాంట్ ఏ దిక్కున ఉండాలి.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

చాలా మంది ఇళ్లల్లో ఆకట్టుకునే మొక్కలను పెంచుతారు. ముఖ్యంగా పూల మొక్కలు, అందంగా కనిపించే మొక్కలను నాటుతారు.. అలాంటి వాటిల్లో మనీ ప్లాంట్ మొక్క ఒకటి.. మనీ ప్లాంట్ మొక్క గురించి దాదాపు అందరికీ తెలుసు.. ఇంటిలో మనీ ప్లాంట్ ఉంచడం నిజంగా అదృష్టాన్ని కలిగిస్తుందా.. ఏ ప్రదేశంలో, ఏ దిక్కులో ఉంచాలి, ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మనిషికి అదృష్టంగా భావించే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి. చాలామంది తమ ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటారు. ఈ మొక్క మంచిగా, ఏపుగా పెరుగుతుంది. ఇంట్లో ఈ మొక్క ఉంటే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి వస్తుందని కొందరు నమ్ముతారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనీ ప్లాంట్ అప్పుల బాధలను పోగొట్టి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అయితే, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మొక్కను సరైన రీతిలో, సరైన దిశలో ఉంచకపోతే లాభాలు రాకపోగా నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వాస్తు ప్రకారం, ఈ మొక్కను ఇంటిలోని ఈశాన్య దిక్కులో ఉంచితే రావలసిన డబ్బు ఆగిపోవడమే కాకుండా, ఇంట్లో ఉన్న ధనం ఆవిరి అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇంట్లో వారికి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. పడమర దిక్కున ఈ మొక్కను పెంచితే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మరి ఈ మొక్కను ఏ దిశలో పెంచితే మంచిది అనే సందేహం అందరికీ వస్తుంది. వాస్తు ప్రకారం, తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులలో మనీ ప్లాంట్ ను పెంచుకోవచ్చు. ఇంటికి ఆగ్నేయ దిక్కులో ఈ మొక్కను పెంచుకోవడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చు. ఆగ్నేయం వినాయకునికి ఎంతో ఇష్టమైన స్థలం. అందుకే ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ను పెంచితే వినాయకుని ఆశీస్సులు లభిస్తాయి. పురాణాల ప్రకారం, ఈ మొక్కను తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచి రోజు నీరు పోసి పెంచితే గణపతి లక్ష్మీగణపతిగా మారి మన ఇంట్లో ధన ప్రాప్తిని కలిగిస్తాడని ప్రతీతి..
మనీ ప్లాంట్ ను సంరక్షించడంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా పాటించాలి. ఈ ప్లాంట్ ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్కను నేలపై కాకుండా పైకి ఎగబాకేలా చూసుకోవడం ద్వారా అది ఆకాశాన్ని చూస్తూ ఎదుగుతుంది. ఇది వృద్ధిని సూచిస్తుంది. ఈ మొక్క పండిపోయిన, పసుపు రంగు ఆకులను వెంటనే తొలగించాలి.. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని సూచిస్తాయి. మొక్క ఎంత పచ్చగా ఉంటే కుటుంబం కూడా అంతే పచ్చగా ఉంటుందని నమ్మకం. ఇంకో విషయం, ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు ఈ మొక్క జోలికి పోకుండా, మొక్క ఆకులను తినకుండా చూసుకోవాలి. ఈ విధానాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో అదృష్టం, ఆర్థిక శ్రేయస్సు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
(గమనిక: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
