
Yadadri Temple: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ విమాన గోపురం కోసం ఆరు కిలోల బంగారాన్ని బహుకరించనుంది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ పుణ్యకార్యంలో పాల్పంచుకోవడం గౌరవప్రదమైన అవకాశంగా భావిస్తున్నట్లు MEIL ప్రకటించింది.
పునః ప్రారంభానికి సిద్ధమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో అత్యంత కీలకంగా నిలిచింది విమాన గోపురం. యాదాద్రిలో 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ గోపురానికి బంగారం తాపడం చేయించాలని నిర్ణయించించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు యాదాద్రి పనుల పరిశీలకోసం వచ్చినప్పడు ఇదే అంశంపై కీలక ప్రకటన చేశారు. ఆలయ విమాన గోపురానికి 125 కేజీల బంగారంతో తాపడం చేయిస్తామని తెలిపిన కేసీఆర్.. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని చెప్పారు. తమకు తోచినంత విరాళ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎంత విరాళం ఇచ్చినా తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి ఆలయ విమాన గోపురం నిర్మాణం కోసం ఆరు కిలోల బంగారం బహుకరించాలని నిర్ణయించింది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ -MEIL. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం ఎంతో పుణ్య కార్యక్రమమని, ఇందులో తాము పాలుపంచుకోవడం ఎంతో గౌరవప్రదమైన అవకాశమని తెలిపారు MEIL డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి. దీనికి సంబంధించి త్వరలోనే ఆరు కేజీల బంగారం లేదా అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేస్తామని అన్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన, పుణ్యస్థలమైన యాదాద్రి క్షేత్రం.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మక రూపకల్పనలో మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ గతంలో క్రిష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని దర్శనీయ పుణ్య క్షేత్రాల్లో ఒకటి ప్రఖ్యాతి పొందింది.
Also read:
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..
TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..