Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల తాకిడి.. ఈనెల 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్

|

Feb 14, 2022 | 2:06 PM

మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు.

Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల తాకిడి..  ఈనెల 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్
Kcr Medaram
Follow us on

CM KCR to Medaram Jatara 2022: తెలంగాణ(Telangana) కుంభమేళా.. మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర(Sammakka-Saralamma Jathara) ఉత్సవాలు ఈ నెల 16న బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మహాజాతర మొదుల కాకముందే మేడారం జంపన్న వాగు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వనదేవతలను దర్శించుకునేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అప్పడే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నిన్న ఆదివారం సెలవు రోజు కావడంతో.. భక్తుల తాకిడి పెరగడంతో మేడారం సందడిగా మారింది. ఈ ఒక్కరోజు దాదాపు ఆరున్నర లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈసారి జాతరకు ముందు నెల రోజుల నుంచే అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ నెల 18న సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా జారతకు వస్తారన్నారు. జాతరకు అన్ని వర్గాల ప్రజలకు సహరించాలని రాష్ట్ర మంత్రులు కోరారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జాతరకు విజయవంతం చేయాలన్నారు. మేడారం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా 34 పార్కింగ్ ప్లేస్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడా ఏ సమస్య రాకుండా చూసేందుకు జాతరలో మొత్తం 40 వేల మంది అన్ని శాఖలకు చెందిన సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు మంత్రి తెలిపారు.మేడారం జాతరలో ఆర్టీసీ పాత్ర చాలా కీలకమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గతంలో 3,300 బస్సులను జాతరకు నడపగా.. ఈసారి మరో 500 పెంచామని, మొత్తం 3800 బస్సులు నడపనున్నామని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులు మాత్రమే సమ్మక్క సారలమ్మ తల్లుల గద్దెలకు సమీపంలో దిగుతారని గోవర్ధన్ చెప్పారు. భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈనెల16 నుంచి జాతర
కాగా మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఉత్సవాలు ఈ నెల 16న బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 16న బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. 17న గురువారం చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెపై కొలువుదీరనున్నారు. 18న శుక్రవారం భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 19న శనివారం సమ్మక్క ,సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. కాగా, సమ్మక్క–సారలమ్మల పూజారులు అమ్మవార్ల పూజా కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. దేవాదాయ శాఖ అధ్వర్యంలో పూజారులకు కావాల్సిన పూజ సామగ్రి, దుస్తులు అందించారు.

జాతరకు ముందే భక్తుల తాకిడి
భక్తుల తాకిడి పెరుగుతుండటంతో పోలీసులు ముందస్తుగా శనివారం నుంచే ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆదివారం సెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగి హన్మకొండ–మేడారంకు వెళ్లే రహదారి పస్రా, తాడ్వాయి, నార్లాపూర్‌ మార్గాల్లో పలుచోట్ల ట్రాఫిక్‌ జామైంది. తాడ్వాయి–మేడారం మధ్య గంటల తరబడి వాహనాలు నిలిచి భక్తులు ఇబ్బందిపడ్డారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మేడారం సందర్శనలో ఉండటం, మరోవైపు మేడారం బస్‌ డిపో ప్రారంభం సందర్భంగా ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఉన్నతాధికారులు రావడంతో పోలీసు బలగాలను అక్కడ మోహరించాల్సి వచ్చింది. పోలీసులు అప్రమత్తమై ఎక్కకికక్కడ వాహనాలను పార్కింగ్‌ స్థలాల్లోకి మళ్లించి నియంత్రణ చర్యలు చేపట్టారు.

Read Also…. PM Kisan: రైతులకు గమనిక.. ‘పీఎం కిసాన్‌’ కింద కుటుంబంలో ఎంతమంది లబ్ధి పొందవచ్చు..?