AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య.. పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజు తప్పక చేయాల్సిన పనులివే!

Mahalaya Amavasya Rituals Telugu: 2026లో మహాలయ అమావాస్య అక్టోబర్ 10, శనివారం వచ్చింది. పితృదేవతలను స్మరించుకుంటూ ఈ రోజున తర్పణం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం, అన్నదానం ఎలా చేయాలి? మహాలయ అమావాస్య ప్రాముఖ్యత, ఆచరించాల్సిన సంప్రదాయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకోండి.

Mahalaya Amavasya: మహాలయ అమావాస్య.. పితృదేవతల అనుగ్రహం కోసం ఈ రోజు తప్పక చేయాల్సిన పనులివే!
Mahalaya Amavasya Rituals
Rajashekher G
|

Updated on: Oct 10, 2026 | 9:23 AM

Share

Mahalaya Amavasya: అమావాస్యను చాలామంది అశుభమైన రోజుగా భావిస్తారు. అయితే సనాతన హిందూ సంప్రదాయంలో పితృదేవతలను స్మరించుకోవడానికి ఈ తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యను పితృకార్యాలకు అత్యంత విశిష్టమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున తర్పణాలు, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం, అన్నదానం చేయడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని ధార్మిక విశ్వాసం.

మహాలయ అమావాస్య ఎప్పుడు?

2026లో మహాలయ అమావాస్య అక్టోబర్ 10, శనివారం వచ్చింది. భాద్రపద బహుళ పక్షం చివరి రోజున వచ్చే ఈ అమావాస్యను మహా పితృపర్వంగా భావిస్తారు. మహాలయ పక్షం మొత్తం పూర్వీకులను స్మరించుకోవడానికి ప్రత్యేకమైన కాలమని సంప్రదాయాలు చెబుతున్నాయి.

మహాలయం అంటే ఏమిటి?

మహాలయ పక్షంలో పితృదేవతల పేరుతో తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమయంలో సంతానం సమర్పించే తర్పణాలు, పిండప్రదానాల ద్వారా పితృదేవతలు తృప్తి చెందుతారని విశ్వసిస్తారు. అందుకే మహాలయ పక్షం ముగింపు రోజైన అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

ఇవి కూడా చదవండి

మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలి?

గరుడ పురాణం సహా ధార్మిక సంప్రదాయాల్లో అమావాస్యను పితృదేవతలకు ప్రీతికరమైన తిథిగా పేర్కొంటారు. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ జలతర్పణం, తిలతర్పణం, శ్రాద్ధకర్మలు, పిండప్రదానం చేయవచ్చు. సంప్రదాయం ప్రకారం అన్నం, నీరు, పాలు, పండ్లు, కందమూలాలు వంటి పదార్థాలను సమర్పిస్తారు. శ్రాద్ధకర్మలు నిర్వహించే అవకాశం లేనివారు తమ శక్తికి అనుగుణంగా అన్నదానం, వస్త్రదానం లేదా ఇతర దానధర్మాలు చేయవచ్చు. నదీ తీరంలో లేదా పవిత్రమైన ప్రదేశంలో జలతర్పణం చేయడం కూడా ఆచారంలో భాగంగా ఉంది.

స్వయంపాకం అంటే ఏమిటి?

శ్రాద్ధకర్మలు పూర్తిస్థాయిలో నిర్వహించలేని వారు సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వవచ్చు. ఇందులో ఉప్పు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకులను అందిస్తారు. అది కూడా సాధ్యం కానివారు దక్షిణ, తాంబూలాలు సమర్పించవచ్చు. అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం కూడా పితృస్మరణలో భాగంగా భావిస్తారు.

శ్రాద్ధకర్మలు చేయలేకపోతే ఏం చేయాలి?

అనారోగ్యం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల శ్రాద్ధకర్మలు నిర్వహించలేనివారు కుటుంబ సభ్యులు లేదా బంధువుల సహాయంతో పితృకార్యాలను చేయించవచ్చు. విదేశాల్లో ఉన్నవారు తమ పూర్వీకులను మనస్ఫూర్తిగా స్మరించుకుని నమస్కరించుకోవచ్చు. పరిస్థితులను బట్టి కుటుంబ ఆచారాలకు అనుగుణంగా పితృకార్యాలను నిర్వహించవచ్చు.

శ్రద్ధతో పితృదేవతలను స్మరించుకోండి

‘శ్రద్ధయా దీయతే ఇతి శ్రాద్ధం’ అనే భావన ప్రకారం శ్రద్ధతో సమర్పించేదే శ్రాద్ధం. ఆడంబరాల కంటే భక్తి, కృతజ్ఞతలకు ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దలు చెబుతారు. తల్లిదండ్రులతో పాటు మరణించిన బంధువులు, గురువులు, ఆప్తులను కూడా స్మరించుకోవచ్చు. మహాలయ అమావాస్య అనేది పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే సందర్భం. ఈ రోజున వీలైనంత మేరకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు లేదా దానధర్మాలు నిర్వహిస్తూ పితృదేవతలను స్మరించుకోవడం ఈ పర్వదినం వెనుక ఉన్న ప్రధాన ఆధ్యాత్మిక భావన.

(Disclaimer: ఈ కథనంలోని అంశాలు ధార్మిక సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ఆచారాలు కుటుంబం, ప్రాంతాన్ని బట్టి మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us