2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. పురాణాల కథనాల ప్రకారం.. సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. ఈ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. అదే సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమి పై పడ్డాయి. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్ , ఉజ్జయిని అనే నాలుగు ప్రదేశాలలో అమృతం చుక్కలు పడ్డాయి. అందుకే ఈ ప్రదేశాలలో మహా కుంభ మేళా, కుంభ మేళా, అర్ధ కుంభ మేళా నిర్వహించే సంప్రదాయం మొదలైంది. మహా కుంభ మేళా, కుంభ మేళా నిర్వహణకు సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. అందులో ఒక కథ , విష్ణువు, సముద్రుడు, లక్ష్మీ దేవికి సంబంధించినది.
ఒకరోజు క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కూర్చుని ఉన్నారు. అప్పుడు సముద్రుడి కొడుకు శంఖ అక్కడికి చేరుకున్నాడు. సముద్రంలో నివసించే జీవుల నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత శంఖం వహించాడు. ఈ బాధ్యతను శంఖం తండ్రి అయిన సముద్రుడు ఇచ్చాడు. పాతాళ లోకం, నాగ లోకం కూడా సముద్రం అడుగున ఉన్నాయి. అందుకే వీరు కూడా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించేవారు. అయితే ఒకసారి శంఖం రాక్షసుల కుట్రలో చిక్కుకుని.. విష్ణువు నుంచి పన్ను వసూలు చేయడానికి వెళ్ళాడు. మహావిష్ణువు నుంచి పన్ను వసూలు చేయమని రాక్షసులు శంఖానికి చెప్పారు. అందరి నుంచి పన్ను వసూలు చేస్తున్నావు.. సముద్రంలో నివసిస్తున్న విష్ణువు,లక్ష్మీదేవి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని రాక్షసులు అడిగారు.
శంఖం రాక్షసుల సలహాను అనుసరించి క్షీర సాగరానికి చేరుకుని విష్ణువు ను పన్ను చెల్లించమని కోరాడు. విష్ణువుని దుర్భాషలాడాడు. శ్రీ హరి ఎంత చెప్పినా చెప్పినా శంఖం వినలేదు.
విష్ణువుని తిట్టడమే కాదు .. పక్కనే ఉన్న లక్ష్మీదేవి వైపు శంఖం చూస్తూ.. ఇంత అందమైన స్త్రీని తన దగ్గర కూర్చోబెట్టుకున్నావు కానీ తనకు పన్నులు కట్టాలని ఎందుకు అనుకోవడం లేదంటూ విష్ణువుని ప్రశ్నించాడు. శంఖం చేసిన వ్యాఖ్యలను విన్న విష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఆగ్రహించారు. విష్ణువు కౌమాది గదతో శంఖంపై దాడి చేసాడు. శంఖం మరణించాడు.
శంఖ మరణవార్త తెలిసిన వెంటనే సముదుడు తన నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే క్షీర సాగరాన్ని చేరుకున్నాడు. శ్రీ మహా విష్ణువు చెప్పేది వినకుండా విష్ణువుని శపించాడు. లక్ష్మీదేవి కారణంగానే శ్రీ హరి తన కుమారుడిని చంపాడని నమ్మిన సముద్రుడు.. లక్ష్మీదేవి .. శ్రీహరి నుంచి విడిపోయి సముద్రంలో కలిసిపోతుందని శంపించాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి సముద్రంలో కలిసి అదృశ్యమైంది. లక్ష్మీ దేవిని తిరిగి ఇవ్వమని శ్రీహరి సముద్రుడిని చాలాసార్లు కోరాడు. అయినా శ్రీ హరి మాట వినలేదు.
సముద్ర దేవుడు .. శ్రీహరి మాట వినకపోవడంతో.. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసేలా చేశారు. ఈ మథనం సమయంలో సముద్రుడు తన గర్భంలో ఉన్న ఎన్నో అమూల్యమైన రత్నాలను పోగొట్టుకున్నాడు. చివరికి తన ఓటమిని అంగీకరించాడు. లక్ష్మీ దేవిని, అమృత కలశాన్ని పంపాడు. అప్పుడు శ్రీ హరి మరోసారి లక్ష్మీ దేవిని వివాహం చేసుకున్నాడు.
కలశంలోని అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. ఆ కలశం నుంచి అమృత బిందువులు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ , ఉజ్జయినిలో భూమిపై పడ్డాయి. మహా కుంభ మేళా, కుంభ మేళా, అర్ధ కుంభ మేళాలు జరిగే నాలుగు ప్రదేశాలు ఇవి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.