
భగవద్గీత గ్రంథం అనేది ఒక కాలాతీత, సార్వత్రిక సందేశం. విశ్వంలోని జ్ఞానమంతా భగవద్గీతలో నిండి ఉందని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. అలాంటి భగవద్గీతపై మద్రాస్ హైకోర్టు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భగవద్గీత మత గ్రంథం కాదని పేర్కొంది. అంతేగాక, భగవద్దీత, వేదాంతం, యోగాలను కేవలం ఒక మతానికి మాత్రమే పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది.
భగవద్దీగత, వేదాంతం, యోగా లాంటి అంశాలను బోధించడం వల్ల ఒక సంస్థను మతపరమైన సంస్థగా ముద్ర వేయలేమని హైకోర్టు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) కింద ఒక ట్రస్ట్ దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన క్రమంలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. భగవద్గీత మతాలకు అతీతమైనదని.. భారతీయ సంస్కృతికి చిహ్నమని తెలిపారు.
కేసు వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరుకు చెందిన అర్ష విద్య పరంపర ట్రస్ట్ అనే సంస్థ వేదాంతం, సంస్కృతం, హఠయోగం లాంటి అంశాలను బోధిస్తూ ప్రాచీన గ్రాంథాల డిజిటలైజేషన్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ ట్రస్ట్ విదేశీ నిధులను పొందేందుకు 2021లో ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ దరఖాస్తును తిరస్కరించింది. ఇందుకు ట్రస్ట్ కార్యకలాపాలు మతపరమైనవిగా కనిపిస్తున్నాయని, ముందస్తు అనుమతి లేకుండా రూ. 9 లక్షల విదేశీ విరాళాలను పొందిందనే కారణాలను చూపింది.
ఈ నేపథ్యంలో అర్ష విద్య పరంపర ట్రస్ట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ జీఆర్ స్వామినాథన్ విచారించారు. కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలను హైకోర్టు తప్పుబట్టింది. భగవద్గీత కేవలం ఒక మతానికి పరిమితమైన గ్రంథం కాదని, అది మోరల్ సైన్స్ అని పేర్కొంది. భారతీయ నాగరికతలో ఒక భాగమని స్పష్టం చేసింది. అంతేగాక, యోగాను మతపరమైన కోణంలో చూడటం అమానుషమని ఘాటుగా స్పందించింది. యోగా అనేది విశ్వవ్యాప్తమైనదని పేర్కొంది. ఇక, వేదాంతం అనేది మన పూర్వీకులు అందించిన స్వచ్ఛమైన తత్వశాస్త్రమని పేర్కొంది.
అంతేగాక, ఎఫ్‌సీఆర్ఏ చట్టం ప్రకారం.. ఒక సంస్థ మతపరమైనదా కాదా అని నిర్ణయించేటప్పుడు అధికారుల వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం అలా కనిపిస్తోందనే అనుమానంతో దరఖాస్తును తిరస్కరించడం సరికాదని పేర్కొంది. 2021లో చేసుకున్న దరఖాస్తుపై 2024 అక్టోబర్‌లో చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. త్వరితగతిన, పారదర్శకంగా వ్యవహరించడం సుపరిపాలనలో ప్రాథమిక సూత్రమని ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
గతంలో జరిగిన నిబంధనల ఉల్లంఘనకు (రూ. 9 లక్షల విరాళంకు సంబంధించి) ట్రస్ట్ ఇప్పటికే జరిమానా కట్టి రాజీ పడినందున.. దాన్ని మళ్లీ కారణంగా చూపలేమని హైకోర్టు వెల్లడించింది. అంతేగాక, ఈ దరఖాస్తును మళ్లీ కొత్తగా పరిశీలించి.. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల్లో, విదేశీ నేతలు మన దేశానికి వచ్చిన సమయంలోనూ భారత్ తరపున భగవద్గీతను బహుమతిగా అందిస్తున్న విషయం తెలిసిందే.