Ayodya: రామ జన్మభూమిలో శ్రీ కృష్ణ జన్మోత్సవ వేడుకలు.. కన్నయ్యగా బాల రామయ్య దర్శనం

అయోధ్యలోని రామ జన్మభూమి సముదాయంలో కృష్ణ జన్మాష్టమికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. బాల రామయ్య గర్భగుడి ముందు శ్రీకృష్ణుని జన్మదినోత్సవం జరుపుకోనున్నారు. ఆలయాన్ని పువ్వులు, దీపాలతో అలంకరించారు. బాల రామయ్యని ప్రత్యేకంగా అలంకరించి పసుపు రంగు దుస్తులను ధరింపజేయనున్నారు. కన్నయ్య జన్మదినం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేసి, పాటలు పాడతారు. అనంతరం పంజిరి ప్రసాదం పంపిణీ చేస్తారు.

Ayodya: రామ జన్మభూమిలో శ్రీ కృష్ణ జన్మోత్సవ వేడుకలు.. కన్నయ్యగా బాల రామయ్య దర్శనం
Ayodhya Ram Temple

Edited By: TV9 Telugu

Updated on: Aug 18, 2025 | 11:48 AM

శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున బ్రజ్ ప్రాంతంతో సహా దేశం మొత్తం శ్రీకృష్ణుని జన్మ దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది. క్రిష్నయ్య భక్తులు ఆనందంలో మునిగిపోతారు. ఈ ఏడాది రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో కూడా జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి, ఆనంద వాతావరణం ఉంటుంది. అభినందనలు ప్రతిధ్వనిస్తాయి, భజనలు, కీర్తనలు పాడతారు. దేవకినందనుడు భూమిపైకి దిగిన ఆనందం యావత్ భారత దేశంలో కనిపిస్తుంది.

బాల రామయ్య గర్భగుడి ముందు కన్నయ్య జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16 అర్ధరాత్రి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి, ఆలయ ప్రాంగణాన్ని పువ్వులు, రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజు ఉదయం మేల్కొని స్నానం చేసిన తర్వాత బాల రామయ్యని ప్రత్యేకంగా అలంకరించి పూజిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించిన తర్వాత బాల రామయ్య తలపై బంగారు కిరీటం ఉంచుతారు.

ఇవి కూడా చదవండి

రామ జన్మ భూమిలోని కొన్ని దేవాలయాలు ఆగస్టు 15న కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి సిద్ధమవుతున్నప్పటికీ.. రామమందిరంలో ఆగస్టు 16న శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున కృష్ణ జన్మోత్సవం జరుపుకుంటారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దీని కోసం సన్నాహాలు చేస్తోంది. రామనవమి లాగా.. కృష్ణ జన్మాష్టమిని గొప్పగా జరపరు. అయితే కన్నయ్య జన్మ దినోత్సవాన్ని ఒక సంతోషకరమైన వేడుకగా జరుపుకుంటారు.

బాల రామయ్య ఆలయంలోని ఒక అర్చకుడి ఈ విషయంపై మాట్లాడుతూ.. శ్రీరాముడు.. శ్రీ కృష్ణుడిని విష్ణువు అవతారాలుగా భావిస్తారు. ఈ కారణంగా శ్రీకృష్ణుని జన్మదినం రోజున బాల రామయ్యకు ప్రత్యేక అలంకరణ చేసే సంప్రదాయం ఉంది. జన్మస్థలంలో ఆలయ నిర్మాణం ముందు నుంచి ఈ సంప్రదాయం పాటిస్తున్నారు. ఈ రోజున సాధారణ దినచర్య ప్రకారం.. బాల రామయ్యని ఉదయం మేల్కొలిపి స్నానం చేసి మంగళ హారతి నిర్వహిస్తారు.

ఆ తరువాత బాల రామయ్యకు పసుపు రంగు దుస్తులను ధరింపజేస్తారు. సాంప్రదాయ ఆభరణాలు, బంగారు కిరీటంతో అలంకరిస్తారు. గొప్పగా అలంకరణ చేస్తారు. హారతిని ఇస్తారు. 56 రకాల ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అర్ధరాత్రి 12 గంటలకు కన్నయ్య జన్మించినప్పుడు గర్భగుడి ముందు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పాటలు పాడతారు. శ్రావ్యమైన సంగీతంతో సంకీర్తనలు చేస్తారు.

కన్నయ్యకు సమర్పించిన పంజిరి ప్రసాదాన్ని హాజరైన సాధువులు, ట్రస్ట్ సభ్యులకు, ఉత్సవాలు జరుపుకునే సంస్థలకు పంపిణీ చేస్తారు. మర్నాడు భక్తులకు కూడా పంపిణీ చేస్తారు. ట్రస్ట్ సభ్యులు చెప్పిన సమాచారం ప్రకారం ట్రస్ట్ ఒకటిన్నర క్వింటాళ్ల పంజిరిని తయారు చేస్తున్నారు. రామమందిర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. సాంప్రదాయాన్ని అనుసరించి ఈ ఏడాది కూడా కృష్ణ జన్మాష్టమి పండుగను శుభ సమయంలో జరుపుకుంటామని అన్నారు. దీని కోసం సన్నాహాలు జరుగుతున్నాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.