హిందూ మతంలో శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని ఆరాధనకు విశిష్ట స్థానం ఉంది. కృష్ణుడి అనుగ్రహంతో అన్ని దుఃఖాలను తొలగి.. సుఖ సంతోషాలు, అదృష్టం కలుగుతుందని విశ్వాసం. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి ఎత్తైన అవతారాల్లో పూర్ణావతారంగా భావించే శ్రీకృష్ణుడిని భావిస్తారు. కన్నయ్య జన్మదినాన్ని ప్రతి సంవత్సరం శ్రావణమాసం కృష్ణ పక్షం అష్టమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం.. కృష్ణుడి పుట్టిన రోజుని 6 సెప్టెంబర్ 2023 న జరుపుకోనున్నారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే వ్యక్తులు, ఇస్కాన్‌తో అనుబంబంధం ఉన్న వ్యక్తులు 7 సెప్టెంబర్ 2023 రాత్రి జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవం సందర్భంగా.. కన్నయ్య భక్తులు పూజలో ఇతర వస్తువులతో పాటు 56 నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే కృష్ణుడికి కేవలం 56 నైవేద్యాలు ఎందుకు సమర్పించబడతాయి.. ఈ సంఖ్యకు హిందూ మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి? ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
హిందూ విశ్వాసం ప్రకారం ఒకసారి గోకులంలోని ప్రజలు ఇంద్రుని ప్రత్యేక పూజల కోసం సిద్ధమవుతున్నారు.. అప్పడు కృష్ణయ్య వారిని దాని వెనుక ఉన్న కారణాన్ని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి మంచి వర్షాలు కురిపిస్తాడని.. మంచి పంటలు పండుతాయని అందుకనే ఇంద్రుడిని పూజిస్తామని.. ఇంద్రుడి సంతోషం కోసం ఇంత పెద్ద పూజ నిర్వహిస్తామని చెప్పారు. అయితే కన్నయ్య ఈ విషయంపై స్పందిస్తూ.. గోవర్ధన్ పర్వతం నుంచి మనకు పండ్లు, కూరగాయలు, జంతువులకు మేత లభిస్తుందని.. అలాంటప్పుడు ఇంద్రుడిని ఎందుకు పూజించాలని పెద్దలను ప్రశ్నించాడు. అంతేకాదు ఇంద్రునికి బదులుగా గోవర్ధనుడిని పూజించాలని ప్రజలకు సూచించాడు.
తనకు గోకుల వాసులు పూజ చేయడం లేదన్న విషయం తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో గోకులం మీద ఏడు రోజులపాటు నిరంతరాయంగా వర్షం కురిపించాడు. అయితే వర్షాల నుంచి తనను.. తన గ్రామస్తులను రక్షించడానికి కన్నయ్య చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు. అలా ఇంద్రుడి గర్వ భంగం అయ్యేవరకూ కన్నయ్య ఆహారం తీసుకోకుండా తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఎనిమిదవ రోజు ఇంద్రుని గర్వం భంగం అయిన తర్వాత కృష్ణుడి మహిమ తెలుసుకుని క్షమించమని కోరతాడు.. దీంతో అప్పుడు గోకుల వాసులు కృష్ణుడు తినడానికి 56 రకాల నైవేద్యాలను సమర్పించారని నమ్ముతారు.
హిందూ విశ్వాసం ప్రకారం ఒక రోజులో ఎనిమిది ప్రహార్లు ఉంటాయి. శ్రీకృష్ణుడు రోజుకు ఎనిమిది సార్లు భోజనం చేసేవాడు. దేవతలకు రాజైన ఇంద్రుడికి గుణపాఠం చెప్పేందుకు శ్రీకృష్ణుడు 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని తన వేలికి పట్టుకుని ఉండడంతో ఆహారం తినలేకపోయాడు. అటువంటి పరిస్థితిలో అతనికి ఏడు రోజుల ప్రకారం మొత్తం 56 రకాల నైవేద్యాలను తయారు చేసి సమర్పించినట్లు అప్పటి నుంచి అదే సంప్రదాయం కొనసాగిస్తున్నట్లు విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)