Unique Temple: పిల్లలకు చాలా ఇష్టమైన ఆలయం.. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామికి చాక్లెట్స్ ప్రసాదం..

సాధారణంగా దేవాలయాలలో దేవునికి పండ్లు, పూలు, స్వీట్లు లేదా సాంప్రదాయ వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత అదే ఆహారాన్ని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేస్తారు. అయితే కేరళలో ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇక్కడ దేవునికి సమర్పించి.. తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచే ఆహారం వెరీ వెరీ స్పెషల్. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇష్టంగా తినే చాక్లెట్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఈరోజు ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకుందాం..

Unique Temple: పిల్లలకు చాలా ఇష్టమైన ఆలయం.. ఇక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామికి చాక్లెట్స్ ప్రసాదం..
Thekkampalani Temple

Updated on: May 27, 2025 | 3:09 PM

భారతదేశం వైవిధ్యం, ప్రత్యేక సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ ప్రతి పుణ్యక్షేత్రం, ప్రతి ఆలయం దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఉన్న తెక్కన్ పళని శ్రీ బాలసుబ్రహ్మణ్య ఆలయం విచిత్రమైన సాంప్రదాయంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ స్వామికి సమర్పించే ప్రసాదం భక్తులను, పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడ భక్తులు మురుగన్ కు వివిధ రకాల చాక్లెట్లను నైవేద్యంగా పెడతారు. ఆపై పూజారి ఆశీర్వదించిన ఈ చాక్లెట్లను భక్తులకు ‘చాక్లెట్ ప్రసాదం’గా పంపిణీ చేస్తారు. దీని ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా.. స్థానికంగా మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షిస్తుంది.

ఈ సంప్రదాయం కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైందని.. క్రమంగా ఇది ఆలయంలో ఒక అంతర్భాగంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎవరైనా భక్తుడు వచ్చినప్పుడు, మురుగన్ కు చాక్లెట్ సమర్పించడం మర్చిపోడు. పిల్లలు ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఆకర్షితులవుతారు. ఎందుకంటే వారికి చాక్లెట్ల రూపంలో భగవంతుని ఆశీస్సులు లభిస్తాయి. ఈ సంప్రదాయం వెనుక నిర్దిష్ట పురాణం లేదా పురాతన ఆచారం లేదని ఆలయ అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేకమైన విశ్వాసానికి ఉదాహరణ

టెక్కాన్ పళని ఆలయంలో మురుగన్‌ను ‘బాల మురుగన్’గా పూజిస్తారు. ఈ ఆలయంలో భగవంతుడిని బాలుడి రూపంలో పూజిస్తారు కనుక ఇక్కడ స్వామికి పిల్లలకు ఇష్టమైన చాక్లెట్‌ను నైవేద్యంగా పెడతారు. ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ రకాల చాక్లెట్లను గర్భ గుడిలో కొలువైన స్వామి పాదాల వద్ద సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం ప్రారంభం వెనుక నమ్మకం ఏమిటంటే.. ఒక భక్తుడు చిన్న బాలుడి రూపంలో ఉన్న స్వామికి తన భక్తి , ప్రేమను వ్యక్తపరచడానికి మొదట చాక్లెట్ సమర్పించాడని నమ్ముతారు. అనంతరం ఈ చాక్లెట్ ను స్వామి ప్రసాదంగా ఇతర భక్తులు కూడా పంచి పెట్టారు. ఈ అలవాటు క్రమంగా నమ్మకంగా మారింది. కాలక్రమంలో చాక్లెట్ సమర్పించడం ఆలయంలో ఒక సాధారణ ఆచారంగా మారింది.

ఇవి కూడా చదవండి

చాక్లెట్ మహోత్సవం

తెక్కన్ పళని బాలసుబ్రమణ్య ఆలయంలో మురుగన్ విగ్రహం చుట్టూ మాత్రమే కాదు హుండీలో కూడా చాకెట్లు కనిపిస్తాయి. వివిధ రకాల బ్రాండ్లు, రుచుల చాక్లెట్లు ఇక్కడ అందిస్తున్నారు. పూజ, హారతి తర్వాత, ఈ చాక్లెట్లను చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. మురుగన్ దేవునికి చాక్లెట్లు సమర్పించడం వల్ల పిల్లల కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి , ఆనందం నెలకొంటాయని స్థానిక ప్రజలు నమ్ముతారు.

పురాతన సంప్రదాయం, ఆధునికత కలయిక

ఈ ప్రత్యేకమైన సంప్రదాయం తేక్కన్ పళని ఆలయాన్ని కేరళలోని అత్యంత ప్రత్యేకమైన , ప్రసిద్ధ ఆలయాలలో ఒకటిగా నిలిపింది. ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని చూడటానికి, అనుభవించడానికి స్థానిక భక్తులే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఆలయం ఆధునికత, భక్తిల అందమైన కలయికకు చిహ్నంగా మారింది. ఈ ప్రత్యేకమైన సంప్రదాయం తెక్కన్ పళని బాలసుబ్రహ్మణ్య ఆలయానికి కేరళలోనే కాదు మొత్తం దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఆలయం మత విశ్వాసం, ఆధునిక అభిరుచి ఆసక్తికరమైన సమ్మేళనానికి నిదర్శనంగా మారింది. ఈ ఆలయాన్ని సందర్శించే వారు ‘చాక్లెట్ ప్రసాదం’ పొందిన తర్వాత భిన్నమైన, మధురమైన అనుభవంతో ఆలయం నుంచి తిరిగి వస్తారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు