Sabarimala: పవిత్ర శబరిమల పుణ్యక్షేత్రంలో ఇదేం పని సామీ..! బయటపడటంతో అధికారుల ఉరుకులు.. పరుగులు!

|

Dec 05, 2024 | 8:50 AM

శబరిమల సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాలలో మద్యం, సిగరెట్లు, గుట్కాలను విక్రయిస్తున్నారు. వీటిని గుర్తించిన భక్తులు, వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం సృష్టిస్తోంది.

Sabarimala: పవిత్ర శబరిమల పుణ్యక్షేత్రంలో ఇదేం పని సామీ..! బయటపడటంతో అధికారుల ఉరుకులు.. పరుగులు!
Shabarimala Ayyappa Temple
Follow us on

అయ్యప్ప దీక్ష అంటే ఎంతో పవిత్రం.. దీక్ష చేపట్టినన్ని 40 రోజుల పాటు మద్యపానం, మాంసం, సిగరెట్, గుట్కా లాంటి అలవాట్లకు దూరంగా ఉంటారు భక్తులు. ఎంతో నిష్టగా మండల దీక్షను పూర్తి చేసుకొని అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. అయితే పవిత్ర శబరిమల క్షేత్రంలో జరుగుతున్న తతంగం స్వాములను షాక్‌కు గురి చేస్తోంది. ఇంత నిష్టగా ఉంటూ వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శబరిమల వెళ్లే భక్తులకు అక్కడ నిషేధిత వస్తువులన్నీ అందుబాటులో ఉండడం వివాదాస్పదంగా మారింది.

శబరిమల సన్నిధానం, పంబ, నీలక్కల్ ప్రాంతాలలో మద్యం, సిగరెట్లు, గుట్కాలను విక్రయిస్తున్నారు కొందరు వ్యాపారులు. భక్తులు వీటిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్‌ చేయడంతో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేరళ ప్రభుత్వ ఆదేశాలతో ట్రావెన్కోర్ బోర్డ్, కేరళ ఎక్సైజ్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో శబరిమల, పంబ, నీలక్కల్ ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న దుకాణాల్లో నిషేధిత వస్తువుల విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పంబ ప్రాంతంలో ఏకంగా 80 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 40 మందికి పైగా అరెస్టు అయ్యారు. వీరికి కొందరు అధికారుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత దూరం నుంచి నిష్టగా మాల ధరించి వచ్చిన భక్తులు.. నిషేధిత వస్తువులను చూసి దారి తప్పుతున్నారు. గత ఏడాది కొందరు భక్తులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం కనిపించలేదు. ఇకనైనా కఠినంగా వ్యవహరించాలని స్వాములు కోరుతున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..