Kashi Vishwanath-Gyanvapi Mosque Land Title Dispute : దేశంలో మరో ఆలయ వివాదం తెరపైకొచ్చింది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కోర్టు..కీలక తీర్పు వెలువరించింది. కాశీ విశ్వనాథ్ ఆలయం, జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్‌పై..ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా-ఏఎస్ఐ అధ్యయనం చేసేందుకు అనుమతిచ్చింది. ఈ సర్వేకు అయ్యే ఖర్చును యూపీ ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది. ఆ సముదాయంలో ఏదైనా నిర్మాణాన్ని కూలదోసి మరొకదాన్ని నిర్మించారా, పునర్నిర్మాణం జరిపారా అనే అంశాన్ని తేల్చాలని ఆదేశించింది కోర్టు.
రస్తోగి అనే న్యాయవాది వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2 వేల ఏళ్ళనాటి కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని 1664లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు కూల్చివేశారని..1991లోనే వారణాసి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆలయం కూల్చివేసిన ప్రదేశంలోనే మసీదు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఆ మసీదుకు ఆలయ స్తంభాలు ఉండటమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. అయితే ముస్లిం సంఘాలు ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నాయి.