కార్తీక మాసంలో చేసే స్నానం, దీపం, పూజ, దానం విశిష్ట ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శివ శివ అంటూ నామస్మరణ, చేసినా.. కార్తీక దామోదర అంటూ కీర్తించినా శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా కార్తీక మాసంలో శివ నామస్మరణ, పూజ అత్యంత ఫలవంతం. సోమవారం చేసే స్నానం, పూజ, జపం ఆచరించినవారు అశ్వమేథ యాగం చేసిన ఫలితం పొందుతారని విశ్వాసం. అయితే కార్తీక మాసంలో సోమవారానికి మరింత విశిష్టత ఉంది.
ఈ ఏడాది కార్తీక మాసం మొదటి సోమవారం నవంబర్ 20వ తేదీన వచ్చింది. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం. శివాలయ సందర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా నక్తం లేదా ఏకభుక్తం ఎవరి శక్తి మేరకు వారు ఆచరించడం మంచిదని శాస్త్ర వచనం. రేపు చేసే దీపారాధన, ఆకాశదీప దర్శనం, దానం, ధర్మం రెట్టింపు ఫలితాలు ఇస్తారని విశ్వాసం.
కార్తీకమాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. నెల రోజులు పూజ చేసినా.. ముఖ్యంగా సోమవారం ఉపవాసం ఉండి.. అత్యంత భక్తిశ్రద్దలతో శివయ్యను పూజిస్తారు. కొంతమంది సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శివయ్యకు పూజ చేసి అనంతరం ఉపవాస దీక్ష విరమిస్తారు. అయితే కోటి సోమవారం రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని ఉవాచ. అందుకే రేపు కోటి సోమవారం కనుక ఉపవాస దీక్ష చేపట్టి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి.
కార్తీక సోమవారం: రేపు సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేసి ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఇంటిలోని పూజ గదిలో దీపారాధన చేసి నక్షత్ర దర్శనం అనంతరం శివాయలయాని వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకుని ఆలయంలో దీపారాధన చేయాలి. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఇలా చేయడం వలన కోటి సోమవారాలు చేసిన ఫలితం దక్కుతుందని విశ్వాసం.
కార్తీకమాసం మహత్యం గురించి మొదటగా వశిష్ట మహర్షి జనక మహరాజునకు వివరించగా.. శౌనకాది మునులకు సూతుడు చెప్పాడు. ఈ నెలలో ప్రతీరోజూ పుణ్య ప్రదమైనదే. రోజూ చేసే స్నానం, అర్చనలు, అభిషేకాలు విశిష్టమైనవి. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన మహోత్సవ వేడుకలు ఆచరిస్తారు.
ఇక ఈ మాసంలో మహా విష్ణువు నదుల్లో మాత్రమే కాదు..చెరువులలో, దిగుడు బావుల్లో, పిల్లకాలువల్లో నివసిస్తాడని విశ్వాసం. కనుకనే ఈ నెలలో సూర్యోదయానికి ముందే చేసే స్నానం గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఈ నెలలో శివకేశవులను, శ్రీ కృష్ణుడిని పూజించడం, తులసి కళ్యాణం అత్యంత ఫలవంతం. ఈ మాసంలో ప్రతీరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏ తిథి వచ్చింది.. ఏ దేవుడిని పూజించాలి.. ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం పూజలను చేయడం అత్యంత ఫలవంతం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు