కాణిపాకం గణపయ్య వార్షిక బ్రహ్మోత్సవాలపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఉభయదారులు, ఆలయ అధికారుల మధ్య వివాదం జరిగింది. అటు.. ఉభయదారులు రెండు వర్గాలుగా విడిపోవడంతో సమావేశంలో మరింత రచ్చ రేగింది. కాణిపాకం వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన ఉభయదారుల సమావేశం రసాభాస అయింది. వచ్చే నెల 7 నుంచి 27 వరకు 21 రోజులపాటు కాణిపాకం గణపయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు అధికారులు. ఈ క్రమంలోనే.. వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఆలయ ఉభయదారులతో ఈవో వెంకటేష్, అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే.. ఆలయ అధికారుల తీరుపై కొందరు ఉభయదారుల ఆగ్రహించారు. ఆలయ ప్రతిష్టకు తగ్గట్టుగా ఆహ్వాన పత్రికలు ముద్రించకపోవడంపై ఉభయదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆహ్వాన పత్రికలను బుక్‌లెట్ రూపంలో కాకుండా సింగిల్ పేపర్‌లో ముద్రించడం, ఆహ్వాన పత్రికల్లో వాహనసేవల వివరాలు, పేర్లు ముద్రించకపోవడాన్ని ఉభయదారులు తప్పుపట్టారు. ఆయా విషయాలపై ఉభయ దారులు, ఆలయ అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వివాదం కాస్తా.. తోపులాట, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. అదేసమయంలో.. ఉభయదారుల్లో పార్టీల సానుభూతిపరులు కూడా ఉండడంతో మరింత రచ్చ చోటుచేసుకుంది. గత ఏడాది జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారి బంగారు విభూదిపట్టి మాయం వ్యవహారంలో సస్పెండ్ అయిన ఆలయ ప్రధాన అర్చకుడ్ని విధుల్లో తీసుకునే అంశంపైనా ప్రధాన చర్చ జరిగింది. ఒక వర్గం ఉభయదారులు ప్రధానార్చకుడిని విధుల్లోకి తీసుకోవడాన్ని స్వాగతిస్తే.. మరో వర్గం వ్యతిరేకించడం ఘర్షణకు దారితీసింది.
వాహనసేవల విషయంలోనూ ఉభయదారుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇలా పోలీసు బందోబస్తు మధ్యే ఉభయదారుల సమావేశం దాదాపు మూడు గంటలు సాగింది. ఇక.. కలెక్టర్ అధ్యక్షతన ఉభయదారుల సమావేశం మరోసారి నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. మొత్తంగా.. కాణిపాకం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవ నిర్వహణపై ఉభయదారుల మధ్య విభేదాలు భగ్గుమనడం చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..