కాళీపట్టి కందస్వామి ఆలయం.. పెళ్లి త్వరగా కావాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!

Kalipatti Kandaswamy Temple: తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని కందస్వామిగా భక్తులు భక్తి పూర్వకంగా పిలుచుకుంటారు. అలాంటి మహిమాన్విత ఆలయాల్లో ఒకటి కాళీపట్టి కందస్వామి ఆలయం. ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న అవివాహితులకు త్వరగా పెళ్లి అవుతుందని విశ్వాసం ఉంది.

కాళీపట్టి కందస్వామి ఆలయం.. పెళ్లి త్వరగా కావాలంటే ఈ ఆలయానికి వెళ్లాల్సిందే..!
Kanda Swamy

Updated on: Jan 28, 2026 | 5:36 PM

తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఇందులో వేల సంఖ్యలో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ఆలయాలు ఉన్నాయి. అందుకే తమిళనాడును భారతదేశంలో ఆలయాల రాష్ట్రం(Temples State)గా పిలుస్తారు. తమిళనాడులో శివుడు, విష్ణువుతోపాటు ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని కందస్వామిగా భక్తులు భక్తి పూర్వకంగా పిలుచుకుంటారు. అలాంటి మహిమాన్విత ఆలయాల్లో ఒకటి కాళీపట్టి కందస్వామి ఆలయం.

ఈ ఆలయం తమిళనాడులోని సేలం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో నామక్కల్–తిరుచెంగోడే మార్గంలో ఉంది. సుమారు మూడు శతాబ్దాల క్రితం మురుగన్ భక్తుడు లక్ష్మణ్ గౌండర్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది.

నల్లరంగు తిరునీర్ ప్రత్యేకత

కాళీపట్టి కందస్వామి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నల్లరంగు తిరునీర్ ప్రసాదం ఉంది. చెరుకు పొట్టును కాల్చిగా వచ్చిన బూడిదతో, పూర్తి ఉపవాసంతో శుద్ధి చేసిన తర్వాత ఈ పవిత్ర తీర్థాన్ని తయారు చేస్తారు. దీనిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయని భక్తుల విశ్వాసం.

పళనికి ప్రత్యామ్నాయ దర్శనం

పళని వెళ్లలేని భక్తులు ఇక్కడ దర్శనం చేస్తే.. పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శన ఫలం లభిస్తుందని నమ్మకం. ఆలయానికి ఎదురుగా లక్ష్మణ గౌండర్ సమాధి కూడా ఉంది.

ఉత్సవాలు, విశేషాలు

ప్రతి మంగళవారం దీపోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. తైపూసం పండుగ సమయంలో భారీగా జరిగే పశువుల సంత దేశంలోనే అతిపెద్దదిగా పేరొందింది. అవివాహితులు మంగళవారం దీపోత్సవంలో దీపం వెలిగిస్తే త్వరగా వివాహం జరుగుతుందని, మంచి సంబంధం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అవివాహిత భక్తులు కూడా వచ్చి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

ఎలా చేరుకోవాలి?

సేలం సహా తమిళనాడులోని ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. భక్తులు కాళీపట్టి కందస్వామిని దర్శించి, మహిమాన్విత తిరునీర్ ప్రసాదాన్ని స్వీకరించి ఆయురారోగ్యాలను పొందుతారు. అంతేగాక, తమ కోరికలను నెరవేర్చమని స్వామివారిని వేడుకుంటారు. కోరికలు తీరిన అనంతరం మరోసారి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం అనేది మీ వ్యక్తిగత విషయం.)