Kadiri Temple: దేశంలో ఎన్నో నరసింహస్వామి ఆలయాలు ఉంటాయి.. కానీ వాటిలో కేవలం నవ నరసింహాలయా (Nava Narasimha temples) ఎంతో ప్రత్యేకత. ఆ నవ నరసింహాలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం.. ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి(Prahlada sametha narasimha swamy) ఆలయం. ఎంతో మహిమ, విశిష్టత కల్గిన ఆ ఆలయంలో స్వామి వారు శ్రీ ఖాద్రి నరసింహునిగా పూజలందుకుంటున్నారు. కాటమ రాయుడా కదిరి నరసింహుడా అంటూ నిత్యం పూలందుకుంటున్న ఆ మహిమాన్విత క్షేత్రం చూడాలంటే.. అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అసలు కదిరి నరసింహునికి ఖాద్రి నరసింహునిగా పేరేందుకు వచ్చింది.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తరువాత అంత ప్రాముఖ్యత కలిగిన ఆ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం.
దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలశాయని పురాణాల్లో తెలిపారు. అయితే ఇలా స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కొన్ని ప్రత్యేకంగా చరిత్రలో నిలిచిపోతాయి.. అవి నేటికీ పూజలందుకుంటూ మహిమాన్విత క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ఇలా ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహాస్వామి క్షేత్రం కూడా ఒకటి. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడుని వదించిన తర్వత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాదిదేవతలు, ప్రహ్లాదున్ని స్వామిని శాంతపరచడం నివల్లే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ ఖాద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేసాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారి ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రి వృక్షం క్రింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో పట్నం పాలగాడు అయిన రంగనాయకుల స్వామి వారి ఆదేశం మేరకు ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది.
విగ్రహంలో దైవ రహస్యం: ఇక్కడ స్వామి వారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్షంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహా స్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారు.. అలాగే శ్రీ ఖాద్రి నరసింహునిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందా… కదిరికి దగ్గరలో ఉన్న గాండ్లపెంట మండలంలోని చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుండి స్వామి ఉద్భవించారని భక్తుల నమ్మకం. స్వామివారు ఉద్భవించిన ఈ కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది. అలాగే ఖాద్రి అని ఎందుకంటారంటే.. సంస్కృతంలో ఖా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఖాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. దేశంలో నవ నరసింహాలయాలుగా పిలువబడే ఆ తొమ్మిది ఆలయాల్లో శ్రీఖాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం కూడా ఒకటి.
ఆలయ నిర్మాణ విశేషాలు: కదిరి పట్టణంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు రెండు ఉన్నాయి. ఒకటి కదిరి పట్టణంలో ఉంటే మరొకటి కదిరి కొండమీద ఉంది. స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత నాభి నుండి వచ్చే నీటినే ఇక్కడి భక్తులు తీర్ధంగా తీసుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగానే మనకు మొదటగా గాలిగోపురం కనపడుతుంది. దీనిని హరిహర రాయ, బుక్కరాయ, శ్రీకృష్ణదేవరాయలు దశల వారిగా 13-15 శతాబ్దల మధ్య కాలల్లో నిర్మించారు. గాలిగోపురం దాటుకుని లోపలికి వెళ్లిన భక్తులకు కళ్యాణకట్ట కనిపిస్తుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులకు స్నానం చేయడానికి దగ్గరలో బురుగుతీర్థం దర్శనమిస్తుంది. బురుగుతీర్థంలో స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి వెలుపల గల పూజ సామగ్రి దుకాణాలను చేరుకుంటారు. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రధాను గోపురనికి కుడివైపు వినాయక మరియు కృష్ణుని ఆలయాలు మనకి కనిపిస్తాయి. ఇక ప్రధాన గోపురాన్ని దాటుకుని లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం కనిపిస్తోంది. ఈ ప్రాంగణంలో పునాది లేకుండా బండాపై నిల్చున్న గరుడస్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు. ప్రధాన ఆలయ విశాల ప్రాంగణంలో కుడివైపు మనకు శ్రీ కోదండరామలయం దర్శనమిస్తుంది. ఇందులో శ్రీరాముడు, సీత, లక్ష్మణ మరియు ఆంజనేయ సమేతుడై ఉంటాడు. సీతారాములను దర్శించుకున్న భక్తులు పక్కనే ఉన్న నాగుల కట్టకు చేరుకుంటారు. ఇలా ఆలయం ప్రాంగణంలో ప్రతి అడుగుకీ ఒక విశిష్టత ఉంది. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి గర్బాలయంలో స్వామి వారు అమ్మతల్లి, తాయారు మరియు ప్రహ్లాదలుతో మనకు దర్శనమిస్తారు. గర్భాలయనికి కుడివైపున భృగు మహర్షి స్థాపించిన వసంత వల్లభలు మనకు దర్శనమిస్తారు. అలాగే కుడి వైపుగా వెళ్తే అమృతవల్లి అమ్మవారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇదేవిధంగా ఎడమవైపు వెళ్తే ఆండాళ్ అమ్మవారు మనకు దర్శనమిస్తారు. గర్బాలయనికి అభిముఖంగా గారుడాళ్వారు స్వామి వారి చిన్న మందిరం ఉంటుంది. గర్భాలయ ప్రవేశానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి.
పూజాదికార్యక్రమాలు: ఇక్కడ ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు ఉంటాయి. ప్రతీసంవత్సరం ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో బ్రహ్మోత్సవలు చాలా వైభవంగా జరుగుతాయి. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ రథోత్సం దేశంలో పూరి జగన్నాథ రథోత్సవం తరువాత అత్యంత పెద్దదిగా చెబుతారు. లక్షలాది మంది భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. రథోత్సవం జరిగే సమయంలో రథం మీదకి భక్తులు మిరియాలు మరియు పండ్లు చల్లుతారు. వాటిని భక్తులు మహాప్రసాదంగా తీసుకుంటారు. కుల మతలకు అతీతంగా పూజలు జరిగే దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన దేవాలయం కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయానికి హిందువులు కాకుండా ముస్లింలు కూడా రావడం ఈ దేవాలయం ప్రత్యేకత. ఈ ఆలయం ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండటం వలన ఇరు రాష్ట్రాల భక్తులు ఇక్కడికి వస్తారు.
ఎలా చేరుకోవాలంటే: శ్రీ కదిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవాలంటే.. హైదరాబాద్ పట్టణానికి 454కి.మీ మరియు అనంతపురంకి సుమారు 100కి.మీ దూరంలో ఉంది. రైలు, బస్సు సౌకర్యం కూడా పలు ప్రాంతాల నుంచి ఉంది. అంతే తిరుపతికి దాదాపు 180కి.మీ.ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది.
Reporter:Kanth, Tv9 Telugu
Also Read: