మాస శివరాత్రి పవిత్ర పండుగ ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడిన చతుర్దశి తిధిన జరుపుకుంటారు. మాస శివరాత్రి శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివ పార్వతులను నియమ నిష్టలతో అత్యంత భక్తీ శ్రద్దలతో పుజిస్తారు. ఉపవాసం ఉంటారు. హిందువులు మాస శివరాత్రిని ఆదిదంపతుల ఆశీర్వాదం పొందడానికి పూజలు చేస్తారు. జేష్ఠ మాసంలో వచ్చే ఈ నెలవారీ శివరాత్రి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.. ఎందుకంటే ఈ రోజున అనేక అరుదైన పవిత్రమైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి.
పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం జేష్ఠ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి జూలై 4వ తేదీ 2024 ఉదయం 5:44 గంటలకు ప్రారంభమై.. మర్నాడు అంటే జూలై 5వ తేదీ ఉదయం 5:57 గంటలకు ముగుస్తుంది. పంచాంగం ప్రకారం జేష్ఠ మాసంలో మాస శివరాత్రిని జూలై 4వ తేదీ 2024 గురువారం జరుపుకోనున్నారు.
భద్ర యోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సారి మాస శివరాత్రి ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ మాస శివరాత్రిలో చాలా అరుదైన కలయికలు జరగనున్నాయి. మాస శివ రాత్రి రోజున అరుదైన భద్ర యోగం కూడా ఏర్పడనుంది. ఈ యోగంలో పరమశివుడిని, పార్వతి దేవిని ఆరాధించిన భక్తులు కోరుకున్న కోరికలు తీరతాయని.. చేపట్టిన ప్రతి పనిలోనూ విషయం సాధిస్తాడని నమ్మకం. ఈ యోగం జూలై 4వ తేదీ ఉదయం 5:54 నుంచి సాయంత్రం 5:23 వరకు ఉంటుంది.
వృద్ధి యోగం
జూలై 4వ తేదీన వృద్ధి యోగం కూడా ఏర్పడుతోంది. ఈ యోగం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మర్నాడు జూలై 5న సాయంత్రం 5:14 గంటల వరకు కొనసాగుతుంది. వృద్ధి యోగంలో శివుడిని ఆరాధించడం వల్ల భక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని.. అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.
మృగశిర నక్షత్రం
మాస శివరాత్రి రోజున మృగశిర నక్షత్రం ఉండనుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మృగశిర నక్షత్రం అన్ని రకాల శుభకార్యాలను నిర్వహించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ నక్షత్రంలో శుభకార్యాలను ప్రారంభించవచ్చు.
అభిజీత్ ముహూర్తం
జేష్ఠ మాసంలోని మాస శివరాత్రి చాలా పవిత్రమైన, శుభప్రదమైన అభిజీత్ ముహూర్తం కూడా వచ్చినట్లు పండితులు చెబుతున్నారు. ఈ అభిజిత్ ముహూర్తంలో పూజలు, శుభకార్యాలు చేసుకోవచ్చు కనుక జూలై 4వ తేదీ మాస శివరాత్రి రోజున.. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.