ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజున జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు. జగన్నాథుడు ఈ రథయాత్రలో తన సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర తో కలిసి వారి వారి రథాలపై కూర్చొని నగరంలో పర్యటిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ రథయాత్రను వీక్షించడం ద్వారా 1000 యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ జగన్నాథ రథయాత్ర వెనుక.. జగన్నాథుని నగర పర్యటన గురించి అనేక పురాణాలు కథలు ఉన్నాయి
పురాణాల ప్రకారం ఒకసారి సుభద్రా దేవి ఈ నగరాన్ని సందర్శించాలని కోరుకుంది. అప్పుడు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కూర్చుని నగర పర్యటనకు బయలుదేరాడు. అప్పుడు జగన్నాథుడు తన అత్త గుండిచా దేవి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఏడు రోజులు అత్త వద్ద విశ్రాంతి తీసుకున్నాడు. అప్పడు కృష్ణుడు చేసిన ఆ యాత్రే జగన్నాథ రథయాత్రకు నమూనాగా మారిందని ఒక కథనం.
మరొక పురాణం ప్రకారం ఒకసారి శ్రీ కృష్ణుని భార్యలు అందరూ కలిసి శ్రీ కృష్ణుని రాస లీల కథలను చెప్పమని బలరాముడు తల్లి రోహిణిని అడిగారు. అప్పుడు రోహిణి.. శ్రీ కృష్ణునితో నీ సుభద్ర ఈ కథలను వినకూడదని కోరింది. అందువలన కృష్ణుడు తన సోదరుడు బలరామడు, సుభద్రను తీసుకని రథయాత్రకు వెళ్ళాడు.
ఇలా రథం మీద ప్రయాణిస్తున్న సమయంలో నారదుడు కనిపించాడు. కృష్ణుడు తన సోదర, సోదరీమణీతో కలిసి ప్రయాణం చేయడం చూసి సంతోషించాడు. అప్పుడు భక్తులకు ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గురు దర్శనం ఇవ్వాలని కృష్ణుడుని నారదుడు అభ్యర్థించారు. నారదుడు చేసిన ఈ అభ్యర్థనను కన్నయ్య అంగీకరించాడు.అప్పటి నుండి ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుందని చెబుతారు. అందుకే ఈ రథయాత్రను చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
మరొక కథనం ప్రకారం ఒకసారి వేదవ్యాసుడు నీ భక్తులందరికీ దర్శనం ఇవ్వమని శ్రీ కృష్ణుడిని ప్రార్థించాడు. ఈ ప్రార్థనకు సమాధానంగా జగన్నాథుడు ఈ యాత్రను నిర్వహించాడు. రథయాత్ర అనేది జగన్నాథుడు తన భక్తులతో ఆనందించే మార్గం అని కూడా చెబుతారు. నాటి నుంచి నేటి వరకూ రథాన్ని అధిరోహిస్తూ నగరంలోని వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు