Mellacheruvu Shivalayam: సృష్టి లయ కారకుడు ఈశ్వరుడు లీలలే వేరు. అప్పుడప్పుడు పరమేశ్వరుడు తన విశ్వ రూపాన్ని భక్తులకు చూపిస్తుంటాడు. పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. కాణిపాకంలో వినాయకుడు తన ఆకారాన్ని పెంచుతున్నట్లుగానే సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వులో కూడా శివ శంకరుడు తన స్వరూపమైన లింగం ఎత్తు పెంచుకుంటున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా మేళ్లచెరువులో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ జాతర నిర్వహిస్తుంటారు. నానాటికీ ఎత్తు పెరగడం ఇక్కడి శివలింగం ప్రత్యేకత.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి వీటిలో మేళ్లచెరువులో ఇష్టకామేశ్వరీ సమేత శంభులింగేశ్వరస్వామి ఆలయం ప్రశస్తమైనది. మహిమ గల దేవుడిగా, భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలవబడే స్వామి వారు లింగం ఆకారంలో ఉన్నారు. అత్యంత ప్రాచీన ఆలయంగా 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవ రాజులు నిర్మించారు. చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు అభివృద్ధి చేశాడని ఆలయ ప్రాంగణంలోని శిలా శాసనం చెబుతోంది.
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలను చూసి పరమేశ్వరుడు చలించి పోయారు. ప్రజల కష్ట సుఖాలను దూరం చేసేందుకు శివుడు హనుమకొండ లోని వేయి స్తంభాల గుడి నుంచి వచ్చి మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిశాడు. ఈ ప్రాంతంలో ఉన్న యాదవ రాజుల పాలనలో ఆవులమందలు ఎక్కువగా ఉండేవి. అటవీ ప్రాంతంలో వెలసిన శివుడికి ఆవులమందలోని ఓ ఆవు నిత్యం పొదుపు ద్వారా పాలు ఇస్తూ ఉండేది. దీన్ని గమనించిన యాదవరాజు శివలింగాన్ని 11సార్లు గొడ్డలితో నరికి పదకొండు ప్రాంతాల్లో వేసినప్పటికీ తెల్లవారేసరికి ఈ యధాస్థితిలో శివలింగం ఉండేదట. గంగ బోయిన మల్లన్న అనే యాదవరాజు కలలో వచ్చి ఈ ప్రాంతం దక్షిణ కాశీగా విరాజిల్లుతుందని ఈశ్వరుడు చెప్పడంతో 1126 లో ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వయంభువుగా వెలసిన శంభులింగేశ్వర స్వామి ఇక్కడ ప్రజలకు పెరుగుతూ వస్తున్నాడు.
ఇక్కడి శివలింగం ప్రత్యేకతలు..
ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలు కలిగి ఉంది. శివలింగం శిరస్సు భాగంలో రెండు వేళ్లు పట్టేంత స్థలం నుంచి గంగా జలం నిత్యం వస్తుండడం, ఎన్నిసార్లు తోడినా నీరు రావడం విశేషం. ఎంతో ఎత్తున ఉండే ఈ ఆలయంలోని శివలింగం నుంచి నీరు ఊరడం భక్తులను విస్మయానికి గురి చేసింది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ జలాన్నే తీర్థ ప్రసాదంగా తీసుకుంటారు. ఇక్కడి శివలింగం శ్వేత వర్ణంలో ఉండటం, వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో భక్తులు శంభులింగేశ్వరస్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు.
కాణిపాకం వినాయకుడి ఆకారం పెరిగినట్లుగానే ఇక్కడ శివలింగం ప్రతీ 60 ఏళ్లకు ఒకసారి లింగం ఒక అంగుళం చొప్పున పెరగటం విశిష్టత. తొలుత లింగానికి మూడు బొట్లు పెట్టే సైజులో ఉండగా.. ప్రస్తుతం ఆరు సైజులకు పెరిగిందని భక్తులు చెబుతున్నారు. లింగం ముందు భాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమనీ పండితులు చెబుతున్నారు. గత వందేళ్ళ నుంచి శివలింగం పెరుగుతున్న విషయాన్ని ఇప్పటి భక్తులకు వారి పూర్వీకులు గుర్తించి చెబుతున్నారు. ఇక్కడి శివలింగానికి మాత్రం పాణ వట్టం రెండు ప్లేట్లుగా ఉండడం మరో ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడైనా శివలింగం పాణ వట్టంతో కలిసి భూమిని ఆనుకొని ఉంటుంది. ఇక్కడి శివలింగానికి మాత్రం పాణ వట్టం రెండు ప్లేట్లుగా ఉంటుంది.గతంతో పోల్చితే రెండు ప్లేట్లుగా ఉన్న పాణవట్టం మధ్య ఎత్తు కూడా పెరిగి కనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు.
శివలింగం వీడియో ఇదిగో…
ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు. ఇక్కడి శివుడు ఎంతో మహత్యం ఉందని, కోరుకున్న కోరికలు తీరుతాయని అంటున్న భక్తులు విశ్వాసం. సంతానం లేని దంపతులు స్వామి వారి ఆలయంలో స్థానసారం దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడ శివుడి మహిమలకు కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.
మరిన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…