Bhagya Lakshmi Temple: హైదరాబాద్ నగరంలో ఐకానిక్ చార్మినార్ లోని ఆగ్నేయ మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని యోగి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహా హారతి కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయితే ఈ ప్రాంతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ గడ్డపై ఉంది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని యోగి దర్శించడంపై సర్వత్రా ఆసక్తినెలకొంది. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చార్మినార్ వద్ద పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఈనేపధ్యంలో చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం ఎప్పుడు వెలసింది? ప్రత్యేక ఏమిటో తెలుసుకుందాం..
నగరంలో అతిపురాతన కట్టడం చార్మినార్ దగ్గర ఉండే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది. పూర్వం ఈ ఆలయం పేరు మీదనే హైదరాబాద్‌ను భాగ్యనగరం అని పిలిచేవారు. మరికొందరు.. భాగమతి పేరు మీద నవాబులు హిందువుల కోసం ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించారని కూడా కొంతమంది చెబుతారు.
ఈ ఆలయంలో లక్ష్మీదేవి కొలువు దీరింది. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఐదుసార్లు అమ్మవారికి హారతి ఇస్తారు. హిందువుల సంప్రదాయం ప్రకారం దీపావళి, బోనాల పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అయితే ఈ ఆలయం గురించి భిన్న వాదనలు కథనాలు వినిపిస్తుంటాయి. కొంతమంది చరిత్రకారులు.. ఈ ఆలయం గురించి కొన్ని చరిత్ర పుస్తకాల్లో మరో విధంగా ఉంది. మహమ్మద్ కులీ అనే ఐదో కుతుబ్ షాహీ రాజు, భాగమతి అనే హిందూ అమ్మాయిని ప్రేమించాడని.. ప్రస్తుతం చార్మినార్ ఉన్న ప్రాంతంలో చించలం అనే గ్రామంలో ఆ అమ్మాయి ఉండేదని తెలిపారు. ఆమెను చూడ్డానికి రోజూ యువరాజు గోల్కొండ నుంచి నది దాటి అక్కడకు వెళ్లేవాడట. కులీ భాగమతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమె పేరు భాగమతి నుంచి హైదర్ మహల్ గా మారిందట..
ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల వద్ద రెండు వెండి రూపాలు ఉంటాయి. ”ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది. పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కనుక మొదట్లో అమ్మవారి ఫోటో పెట్టి పూజాదికార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది.
ఈ ఆలయానికి బస్సు మార్గం ఉంది. అఫ్జలగంజ్ ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..